దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి వాయవ్య దిశగా వేగంగా కదులుతోంది. ఆదివారం మధ్యాహ్నం కల్లా తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ తుపానుగా మారితే ‘అసనీ’గా నామకరణం చేయనున్నారు. మే 10న ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృతుంజయ్ మహపాత్ర తెలిపారు. అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. అల్పపీడనం, తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.


తుపాను బలం పుంజుకుని ఉత్తర, పశ్చిమ దిశగా ప్రయాణించి మే 10న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, ఒడిశాలోని గోపాలపూర్ సరిహద్దులో తీరానికి చేరువ కానుంది. తుపాను మారి ఇది దిశను మార్చుకుంటుందా, లేదా బలహీనపడుతుందా అనేది నేటి రాత్రిలోగా తెలిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కోంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేక చోట్ల వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట, గంటకు 40 నుంచి 60  కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. మత్స్యకారులు రెండు రోజులపాటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. పశ్చిమ బంగాళాఖాతానికి అల్పపీడనం చేరుకున్నాక గాలి తీవ్రత మరింత పెరగనుంది. 






అంత ప్రమాదమేమీ లేదు
తాజాగా దక్షిణ అండమాన్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తుపానుగా మారినా తీవ్ర తుపానుగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. మరో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. 






తెలంగాణలో తేలికపాటి జల్లులు..
అల్పపీడనం ప్రభావంతో  తెలంగాణలో మే 10 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో ఎండ తీవ్రత అధికంగా ఉందని, అవసరమైతేనే మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. అధికంగా ఆదిలాబాద్‌లో 43.8 డిగ్రీలు, ఆ తరువాత నిజామాబాద్‌లో 42 డిగ్రీలు, నల్గొండ, రామగుండంలో, హన్మకొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం 
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిడుగులు పడి వేర్వేరు చోట్ల ముగ్గురు దుర్మరణం చెందారు.  శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నెల్లిపర్తి, బూర్జ మండలం పణుకుపర్త గ్రామాల్లో పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఇందులో ఓ 12 ఏళ్ల బాలిక ఉంది. పిడుగుపాటుకు మరికొందరు అస్వస్థతకు లోనయ్యారు. 


Also Read: Mothers Day 2022: ‘అమ్మ’కు ఇచ్చిన ఆ మాటే ‘మదర్స్ డే’, మే నెల రెండో ఆదివారమే ఎందుకు? దీని వెనుక అంత కథ ఉందా?


Also Read: Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్, ఈ స్టిక్కర్లతో ఉన్న వాహనాలకు కొండపైకి నో ఎంట్రీ