‘మాతృ దేవోభవ’.. తల్లిదండ్రులను మించిన దైవం లేదని మన భారతీయ పురాణాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. అందుకే, అప్పట్లో ప్రతి వ్యక్తి తన తల్లి లేదా తండ్రి పాదాలకు మొక్కిన తర్వాతే ఏ పనైనా మొదలుపెడతారు. ఉదయం నిద్రలేవగానే తల్లి పాదాలను తాకి.. ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలా చేస్తే ఆ రోజంతా వారికి మంచిగా ఉంటుందని భావించేవారు. ఇప్పటికీ మన ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో తల్లిదండ్రుల పాదాలకు మొక్కే సాంప్రదాయం కొనసాగుతుంది. దీన్ని బట్టి చూస్తే.. మన భారతీయులు ప్రతి రోజూ తమ తల్లిని గౌరవించేవారు. దానివల్ల ప్రత్యేకంగా ‘మాతృ దినోత్సవం’ పాటించే అవసరం ఉండేది కాదు. అయితే, పాశ్చత్య దేశాల్లో ఆచారాలు వేరుగా ఉంటాయి. జీవితమంతా వారు తల్లిదండ్రులతో కలిసి జీవించలేరు. అందుకే, అమ్మను గౌరవించుకొనేందుకు ఒక రోజు ఉండాలనే ఉద్దేశంతో ‘మదర్స్ డే’ను ట్రెండ్‌ను మొదలుపెట్టారు. అది కాస్తా ఇప్పుడు కమర్షియల్‌గా మారింది. గిఫ్టులు, కార్డులు అమ్మే సంస్థలు మాతృ దినోత్సవాన్ని పూర్తిగా వ్యాపారమయం చేసేసింది. వాస్తవానికి, ఇది వాణిజ్య అవసరాల గురించి మొదలుపెట్టినది కాదు. ఇద్దరు కొడుకులు తమ అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం మొదలుపెట్టిన తల్లుల పండుగ. ఓ మహిళ యుద్ధంలో సేవలు అందించిన, మరణించిన తల్లులను స్మరించేందుకు చేపట్టిన ఉద్యమం. ‘మదర్స్ డే’ పుట్టేందుకు ఏర్పడిన నేపథ్యాలు వేర్వేరు. కానీ, అవన్ని ఒకే మజిలీకి చేరాయి. ఏటా మే రెండో ఆదివారం ‘మదర్స్ డే’ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 8న.. మాతృ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 


‘మదర్స్ డే’ ఖచ్చితంగా ఎవరు ప్రారంభించారనే అంశంపై అనేక వాదనలు, సందర్భాలు ఉన్నాయి. ప్రాచుర్యంలో ఉన్న వాదన ప్రకారం.. ‘అమ్మ’ను స్మరించుకోవడం కోసం ప్రత్యేకమైన రోజు ఉండాలనే ఆలోచన 1907లో పుట్టిందని అంటారు. జూలియా వార్డ్ హోవే, అన్నా జార్విస్ అనే ఇద్దరు మహిళలు ‘మదర్స్ డే’కు పునాది వేసినట్లు సమాచారం. వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్‌లోని ఆండ్రూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో మొదటి ‘మదర్స్ డే’ ఆరాధన సేవను అన్నా జార్విస్ అందించారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లిని గౌరవించింది. ఇది జరిగిన ఐదేళ్లలోనే అమెరికా మొత్తం ‘మదర్స్ డే’ను పాటించడం మొదలుపెట్టింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 1914లో దీనిని జాతీయ సెలవుదినంగా ప్రకటించారు. ‘మదర్స్ డే’ అనేది అమెరికాలో సాధారణంగా గౌరవించే జాతీయ సెలవుదినం మాత్రమే. కానీ, ప్రభుత్వ సెలవుదినం కాదు.


గ్రీకుల కాలంలో మొదలు?: తల్లిని ప్రత్యేకంగా గౌరవించాలనే ఆలోచన పురాతన గ్రీకుల కాలంలో పుట్టిందనే వాదన కూడా ఉంది. దేవతల తల్లిగా భావించే ‘రియా’ను గౌరవిస్తూ అప్పట్లో ఉత్సవాలు నిర్వహించేవారు. అలాగే క్రైస్తవులు క్రీస్తు తల్లి మేరి మాతను గౌరవించడం కోసం పండుగ జరిపేవారు. అలా ‘అమ్మ’లకు అప్పటి నుంచే గౌరవం దక్కడం మొదలైంది. 


అమెరికన్ మదర్స్ డేని మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లో బాటిల్ హిమ్ ఆఫ్ రిపబ్లిక్ రచయిత జూలియా వార్డ్ హోవ్ సూచించారు. ఈ రోజును శాంతికి అంకితం చేయాలని ఆమె సూచించారు. 1872 నుంచి ఆమె ప్రతి సంవత్సరం బోస్టన్‌లో ‘మదర్స్ డే’ సమావేశాలను నిర్వహించేవారు. అలాగే, మదర్స్ డే మే రెండో ఆదివారం జరుపుకొనే తేదీ నిర్ణయం జూలియట్ కాల్హౌన్ బ్లేక్లీచే వల్లే వచ్చిందనే వాదన ఉంది. 


తల్లికి ఇచ్చిన ఆ మాటే.. ‘మదర్స్ డే’: 1877లో జూలియట్ కాల్హౌన్ బ్లేక్లీ అనుకోకుండా మాతృ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆదివారం, మే 11, 1877న   బ్లేక్లీ పుట్టినరోజు. ఆమె కుమారుడు మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ఆమె పుట్టిన రోజున అతడు అకస్మాత్తుగా చర్చి నుంచి వెళ్లిపోయాడు. అతడి ప్రవర్తనకు బాధపడిన బ్లేక్లీ, ఇతర తల్లులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకను ‘మదర్స్ డే’గా నిర్వహించింది. ఈ విషయం తెలిసి.. బ్లేక్లీ ఇద్దరు కుమారులకు కనువిప్పు కలిగింది. ఆమె పుట్టిన రోజును నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇక ప్రతి సంవత్సరం ఆమె పుట్టిన రోజున మిచిగన్‌లోని అల్బియాన్‌లో గల తమ ఇంటికి వస్తామని అమ్మకు మాట ఇచ్చారు. అంతేగాక, ప్రతి మే నెలలో ప్రతి రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా పాటించాలని పిలుపునిచ్చారు. తమ చర్చికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఇదే విషయాన్ని చెప్పారు. అదే రోజున చర్చిని తల్లుల కోసం కేటాయించాలని క్రైస్తవ పెద్దలను కోరారు.   


ఆమె ఉద్యమంతో మొదలైన కొత్త ట్రెండ్: ‘మదర్స్ డే’ జాతీయ సెలవు దినంగా పాటించడం వెనుక అన్నా ఎం. జార్విస్ అనే ఉపాధ్యాయురాలి కృషి ఉంది. 1907లో అన్నా తన తల్లి గౌరవార్థం జాతీయ మాతృదినోత్సవాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్యమాన్ని ప్రారంభించింది. అన్నా తల్లి అన్నా M. జార్విస్ అంతర్యుద్ధం తర్వాత వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన ‘మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే’ని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో అన్నా జీవించి ఉన్న తల్లులతోపాటు యుద్ధంలో మరణించిన తల్లులను స్మరిస్తూ ‘మదర్స్ డే’ను నిర్వహించాలంటూ ఉద్యమం చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె, ఉద్యమ మద్దతుదారులు ప్రభుత్వ అధికారులకు, క్రైస్తవ పెద్దలకు, వ్యాపారులకు లేఖలు రాశారు. ఫలితంగా 1911 నుంచి ‘మదర్స్ డే’ను దేశవ్యాప్తంగా నిర్వహించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అది ప్రపంచానికి సైతం పాకింది. 1914లో, ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ మేలో రెండవ ఆదివారాన్ని తల్లుల గౌరవార్థం జాతీయ సెలవుదినంగా ప్రకటించారు. అయితే, మదర్స్ డే ఇప్పుడు ‘సెంటిమెంట్’కు బదులు, వాణిజ్య అవసరాలకే ఎక్కువ ఉపయోగపడుతోందని తెలిసి అన్నా అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారట. 


Also Read: మాతృ దినోత్సవం 2022: ఈ అందమైన కోట్స్‌తో ‘అమ్మ’ను అభినందిద్దామిలా!


50 దేశాల్లో ‘మదర్స్ డే’: ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో మే నెల రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా నిర్వహిస్తున్నారు. ఇండియాతోపాటు ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, టర్కీ, బెల్జియం వంటి దేశాలు మే రెండవ ఆదివారం మదర్స్ డేని జరుపుకుంటాయి. మెక్సికో, లాటిన్ అమెరికాలోని అనేక ప్రాంతాల్లో, ప్రతి సంవత్సరం మే 10వ తేదీన మదర్స్ డే జరుపుకుంటారు. థాయ్‌లాండ్‌లో తమ రాణి పుట్టిన రోజు వేడుకను ‘మదర్స్ డే’ నిర్వహిస్తారు.