దాల్చిన చెక్క అందరి ఇళ్లలో కచ్చితంగా కనిపించేదే. బిర్యానీలకు మాత్రమే దీన్ని పరిమితం చేస్తున్నాం. కానీ దీనిలో మనకు తెలియని ఎన్న్ అద్భుత గుణాలు ఉన్నాయి. వీటిలో ఉండే సుగుణాలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతాయని అధ్యయనాలు బయటపెట్టాయి. ముఖ్యంగా మహిళలు వీటిని తింటే గర్భవతి అయ్యే అవకాశాలు రెట్టింపు అవుతాయిట. అందుకే పిల్లల ప్లానింగ్లో ఉన్న జంటలు ఆహారంలో దాల్చిన చెక్కను భాగం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. 


స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది...
మగవారు ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం వల్ల వారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. వీర్యకణాల కదలికలు కూడా చురుగ్గా ఉంటాయి. అదే మహిళలు వీటిని తినడం వల్ల నెలసరులు క్రమపద్ధతిలో వస్తాయి. గర్భం ధరించాలంటే రుతుక్రమం సరిగా ఉండాలన్న విషయం తెలిసిందే. అలాగే మహిళలను గర్భం ధరించకుండా అడ్డుకునే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) రాకుండా అడ్డుకోవడంలో కూడా సహాయపడుతుంది దాల్చిన చెక్క. స్త్రీలలో పిల్లలు కలగకుండా చేసే ప్రధాన కారణాలలో పీసీఓడీ, పీసీఓఎస్‌లు ముఖ్యమైనవి. 


దాల్చిన చెక్క టీ...
దాల్చిన చెక్క అనగానే రోజూ బిర్యానీ చేసుకోవాలేమో అనుకోవద్దు. ఉదయానే దాల్చిన చెక్క టీ లేదా, దాల్చిన చెక్క నీళ్లను తాగాలి. ఆరోగ్యనిపుణులు చెప్పినదాని ప్రకారం పురుషులు లేదా స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో దాదాపు 3 గ్రాముల దాల్చిన చెక్కను తినచ్చు. ఇది సంతానోత్పత్తికే కాదు, బరువును తగ్గించేందుకు, మధుమేహాన్ని నియంత్రించేందుకు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కూడా సహాయపడుతుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను పొడిలా చేసుకుని చిటికెడు కూరల్లో లేదా, సలాడ్లపై, సూప్‌లలో కలుపుకుని తినొచ్చు. అలాగని అధికంగా వేసుకోకూడదు. చిటికెడు మాత్రమే చాలు. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, దాల్చిన చెక్కపొడి, తేనె కలుపుకుని తాగితే చాలా మంచిది. హాయిగా నిద్రపడుతుంది. నిద్రలేమి వంటి రోగాలు పోతాయి.


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read:  తెల్లజుట్టు వల్ల చిన్నప్పుడు అవమానాలు పడ్డ అమ్మాయి... ఇప్పుడు అదే జుట్టు వల్ల సెన్సేషన్‌గా మారింది


Also read: కాఫీ ప్రియులకు శుభవార్త... ఆ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే సత్తా కాఫీకే ఉంది, వెల్లడించిన కొత్త అధ్యయనం