కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం సందర్భంగా ఒక తీర్మానం తీసుకుంటారు. ఈ ఏడాది ఖచ్చితంగా ఇది పాటించాలి అని పెట్టుకుంటారు. అది బరువు తగ్గడం లేదా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.. ఇలా రకరకాల తీర్మానాలు (రిజల్యూషన్స్) తీసుకుంటారు. కానీ వాటిని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది. కొంతమంది కొన్ని నెలల పాటు దాన్ని పాటిస్తే.. మరికొంతమంది మాత్రం కేవలం వారం రోజుల్లోనే గుడ్ బై చెప్పేస్తారు. 


మంచి కోసం మనం తీసుకునే తీర్మానాలు నెరవేరకపోవడానికి రెండు సాధారణ కారణాలు ఉన్నాయి. అవేంటంటే..


☀ మన అలవాట్లు రాత్రికి రాత్రే మార్చుకోవడం అంటే చాలా కష్టం అనే భావన


☀ పెట్టుకున్న లక్ష్యాలు కాస్త కఠినంగా అనిపించడం


వీటిని సాధించలేక వెంటనే పాత అలవాట్లుతోనే కొనసాగుతారు. ఎప్పటిలాగా సాధారణ జీవనశైలికి అలవాటు పడిపోతారు. అందులో నుంచి బయటకి రావాలని గట్టిగా ప్రయత్నించరు. కానీ కొన్ని తేలికైన తీర్మానాలు తీసుకున్నారంటే అవి మిమ్మల్ని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుతాయి. రాబోయే కొత్త సంవత్సరం మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మంచి ఆరోగ్యాన్ని పొందాలని అనుకుంటే ఇవి పాటించాలని సిఫార్సు చేస్తున్నారు డాక్టర్ జ్యోతి కపూర్.


ప్రకృతితో అనుబంధం, ఆరోగ్యం


మీ ఆరోగ్య లక్ష్యాలని చేరుకోవడానికి వేసే మొదటి అడుగు ఇది. ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపటం. ఇది సూర్యకాంతి శరీరానికి తగిలే విధంగా చేస్తుంది. విటమిన్ డి ని పొండటంలో సహాయపడుతుంది. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే రాత్రి పూట బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.


హ్యపీగా ఉండేలా వ్యాయామం


కొత్త సంవత్సరంలో వ్యాయామం చెయ్యాలని నిర్ణయించుకున్నారంటే అది చాలా గొప్ప ఆలోచన. మీకు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. అలా చేస్తే దాన్ని మధ్యలో ఆపకుండా కొనసాగిస్తూ అదొక అలవాటుగా మార్చుకునే వీలు ఉంటుంది.


స్వీయ సంరక్షణ


ఎదుటివారి గురించే కాకుండా మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీకు సంతోషం కలిగించే విషయాలు గుర్తు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చెయ్యాలి. మీరు ఆనందించే పనులు చేసుకునేందుకు సమయం కేటాయించుకోవాలి. ఇష్టమైన వారితో సమయం గడిపితే ఏడాది పొడవునా సంతోషంగా ఉండేందుకు సహాయపడుతుంది.


సమతుల్య ఆహారం తీసుకోవాలి


అన్ని పోషకాలతో కుడైన ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి. నచ్చిన పదార్థాలని తింటూనే మితంగా తీసుకోవాలి. హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరం.


స్నేహితులతో కలిసి ఉండటం


బయటకి వెళ్ళినా, వ్యాయామం చెయ్యడానికి వెళ్ళినా మీ పక్కన మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే ఆటోమేటిక్ గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఒంటరిగా ఉండకుండా మీ ప్రియమైన వారితో మనసులోని భావాలు పంచుకోవడం వల్ల మనసు తేలికపడుతుంది.


ఒత్తిడి దూరంగా ఉంచాలి


అన్నింటి కంటే ముఖ్యమైనది ఒత్తిడిని దూరంగా ఉంచడం. స్క్రీన్ సమయాన్ని తగ్గించి కుటుంబంతో సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. కుటుంబం లేదా స్నేహితులతో కలిసి సరదాగా బయటకి వెళ్ళడం ఒత్తిడిని అధిగమించేందుకు మంచి మార్గం. యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఆఫీసుకి కొన్ని రోజులు సెలవులు పెట్టి వెకేషన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది.


వైద్య పరీక్షలు


క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు, షుగర్, చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునే ఆహారం తీసుకోవాలి. వ్యాధులని దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే కంటి నిండా నిద్రపోవాలి. రోజు 8 గంటల నిద్ర అవసరం. షెడ్యూల్ ప్రకారం నిద్రపోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోయే ముందు కెఫీన్ తీసుకోవడం నివారించాలి.


Also Read: చలికాలంలో సూర్యరశ్మికి దూరంగా ఉంటున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా?