Noida Guidelines on Liquor:


నోయిడాలో గైడ్‌లైన్స్..


న్యూ ఇయర్ వచ్చేస్తోంది. అందరి హడావుడి ఒకటైతే..మందుబాబుల హడావుడి మరోటి. ఇప్పటి నుంచే సిట్టింగ్‌కు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మందు కిక్‌లోనే కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మందు బాబులకు కొన్ని సూచనలు చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ లిక్కర్‌ కొనుగోలు చేయొద్దని సూచిస్తోంది. బిహార్‌లో కల్తీ లిక్కర్‌ కారణంగా ఎంత ప్రాణనష్టం
జరిగిందో మనం కళ్లారా చూశాం. ఇది దృష్టిలో ఉంచుకుని అధికారులు మందు బాబులను అప్రమత్తం చేస్తున్నారు. యూపీలోని గౌతమ బుద్ధ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. అనుమానిత ప్రదేశాల్లో లిక్కర్‌ కొనుగోలు చేయకూడదని వెల్లడించింది. ఢిల్లీ వ్యాప్తంగా ఇప్పటికే "కల్తీ మద్యం"పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. "అనధికారిక విక్రయదారుల నుంచి లిక్కర్‌ కొనుగోలు చేయొద్దు. అందులో మిథైల్ ఆల్కహాల్ ఉంటుంది. ఇది ప్రాణానికెంతో ప్రమాదం" అని జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్బీ సింగ్‌ హెచ్చరించారు. ఈ కల్తీ మద్యం సేవించడం వల్ల కంటి చూపు మందగించడంతో పాటు మరి కొన్ని సమస్యలు వస్తాయని..చివరకు అది ప్రాణాలకూ ముప్పు తెస్తుందని అన్నారు. కల్తీ మద్యాన్ని అక్రమంగా తయారు చేసి, రవాణా చేసి విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. UP Excise Act 2010 కింద...ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి ప్రభుత్వం రూ.10 లక్షల జరిమానాతో పాటు జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించే అవకాశముంది. ఈ మేరకు ఢిల్లీ, నోయిడా సరిహద్దుల్లో నిఘా పెంచారు. ఢిల్లీలోనే కాదు. మరి కొన్ని రాష్ట్రాల్లోనూ "కల్తీ మద్యం"పై అవగాహన కల్పిస్తున్నారు. 


మిగతా చోట్ల..


ఇక హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటకలోనూ న్యూ ఇయర్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో "పార్కింగ్"కు సంబంధించి గైడ్‌లైన్స్ ఇచ్చారు. కొత్త ఏడాది వేడుకలు హిమాచల్‌లో జరుపుకోవాలని అనుకునే వాళ్లు...ముందుగా హోటల్‌తో పాటు పార్కింగ్ ప్లేస్‌ను కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కర్ణాటక విషయానికొస్తే...పబ్‌లు, కాలేజీలు, రెస్టారెంట్‌లు, థియేటర్లు, స్కూళ్లు...ఇలా అన్నిచోట్లా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 1 గంట వరకు మాత్రమే కొత్త ఏడాది వేడుకలు చేసుకోడానికి అనుమతినిచ్చింది. 


National Crime Records Bureau (NCRB) కీలక గణాంకాలు వెల్లడించింది. ఆరేళ్లలో దేశవ్యాప్తంగా 7 వేల మంది కల్తీ మద్యానికి బలి అయ్యారని తెలిపింది. మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్‌లో అత్యధిక మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. బిహార్‌లో కేవలం రెండు మూడు రోజుల్లోనే  30 మందికిపైగా మృతి చెందారు. బిహార్‌లో 2016 నుంచే మద్య నిషేధం అమల్లో ఉంది. ఆ ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,054 మంది కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2017లో 1,510 మంది 2018లో 1,365 మంది...2019లో 1,296 మంది బలి అయ్యారు. 2020లో 947 మంది, 2021లో 782 మందిని కల్తీ మద్యం బలి తీసుకుంది. 2016-21 మధ్య కాలంలో మొత్తంగా 6,594 మంది మృతి చెందారు. అంటే...సగటున రోజుకు కనీసం ముగ్గుర్ని కల్తీ మద్యం కాటేస్తోంది. 


Also Read: Rahul Gandhi: "పప్పు" కామెంట్స్‌పై స్పందించిన రాహుల్, ఆమెను కూడా అలాగే అన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు