ది వరకు రోజుల్లో భోజనానికి ఒక ప్రత్యేక సమయం, తినేందుకు ఒక డైనింగ్ టేబుల్ వంటి వాటన్నింటిని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు చాలా మంది పని చేసుకోవడం నుంచి తినడం నిద్రపోవడం వరకు అన్నీమంచంపైనే. పాండమిక్ తర్వాత మనుషుల ఆలోచనలో, అలవాట్లలో, పనివేళల్లో అన్నింటిలో విపరీతమైన తేడాలు వచ్చాయి. వాటిలో ఒకటి ఇలా మంచాన్ని అన్ని పనులకు వాడెయ్యడం. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ డాక్టర్ సామ్ ఒక చైనా యువకుడి కథను పంచుకున్నారు.


చైనాలోని గ్వాంగ్డాంగ్ కు చెందిన 24 సంవత్సరాల Mr LV ఇలా మంచం మీదే స్నాకింగ్ చెయ్యడం, తిన్న తర్వాత ఖాళీ రెపర్లను మంచం చుట్టూ పడెయ్యడం అలవాటైపోయింది. ఒక రోజు అకస్మాత్తుగా చెవిలో తీవ్రమైన నొప్పితో మేల్కొన్నాడు. ఇంట్లోవారు అతడి చెవిలోకి చూసి ఒక్కసారిగా భయపడ్డారు. అతడి చెవిలో బొద్దింక నివాసిస్తోందట. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు మరో షాకింగ్ విషయం తెలిసింది. అతడి చెవిలో ఉన్నది కేవలం ఒక్క బొద్దింక కాదట. ఏకంగా బొద్దింక ఫ్యామిలీయే చెవిలో కాపురం పెట్టేశాయట. అయితే, ఆ బొద్దింక పొరపాటున అతడికి చెవిలోకి వెళ్లిందనుకుంటే పొరపాటే. దీనికి.. అతడు మంచం మీద భోజనం చేయడానికి మధ్య లింక్ ఉంది.


డాక్టర్లు అతడి చెవిలో సుమారు 10 బొద్దింకలను కనుగొన్నారట. అయితే, ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురుకావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. బొద్దింకలు తెలియకుండా చెవిలోకి దూరవచ్చు. ఇయర్ వాక్స్ వాసన బొద్దింకలను ఆకర్శిస్తుందట. అంతేకాదు ఇయర్ కెనాల్ తేమగా, చీకటిగా ఉంటుంది. అదీ కాకుండా అతడికి మంచం మీదే స్నాకింగ్ చేసే అలవాటు ఉండడం వల్ల మంచంపై తినుబండారాల అవశేషాలు, ముక్కలు ఉండడం వల్ల.. బొద్దింకలు అక్కడే తిష్ట వేశాయట. పెద్దగా కష్టపడకుండా మంచంలోనే ఉంటూ.. అతడు వదిలిపెట్టిన ఆహారాన్ని తింటూ.. అతడికి తెలియకుండానే అవి పెట్స్‌గా మారిపోయాయి. చివరికి.. అతడి చేవినే ఆవాసంగా చేసుకున్నాయి. ఇంత చదివాక కూడా మీరు మంచం మీదే తిండి తింటాం.. పంటాం.. అనుకుంటే మాత్రం మీ ఇష్టం.


చెవిలోకి కీటకాలు దూరితే ఏం చేయాలి?



  • ముందు కంగారు తగ్గించుకోవాలి. అందరూ అనుకుంటున్నట్టు ఇయర్ కెనాల్ నేరుగా మెదడుకు కనెక్ట్ అయ్యి ఉండదు. కాబట్టి కంగారు అక్కర్లేదు.

  • చెవిలో దూరిన కీటకాన్ని మీరే స్వయంగా తీసేందుకు ప్రయత్నం చెయ్యకూడదు. ఏదో ఒక పొడవైన వస్తువు చెవిలో దూర్చడం వల్ల చెవిలో ఉన్న కీటకం కంటే మీకే ఎక్కువ హాని కలగవచ్చు.

  • చెవిలోంచి కీటకాన్ని బయటికి తియ్యడం కంటే దాన్ని చెవిలోనే ముంచెయ్యడం మంచిదట. తక్కువ కాన్సెట్రెటెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవిలో వెయ్యడం లేదా ఆలివ్ ఆయిల్ తో చెవి నింపడం వల్ల కూడా ఆ కీటకం బయటికి రావచ్చు అని చిట్కా డాక్టర్ తన ఫాలోవర్స్ తో పంచుచుకున్నారు.


అంతేకాదు వీలైనంత త్వరగా డాక్టర్ ను సంప్రదించడం కూడా అవసరమే అని సూచించారు. ఎందుకంటే చెవిలో కీటకపు అవశేషాలు మిగిలిపోకూడదు కనుక డాక్టర్ ను సంప్రదించి ఆ విషయాన్ని నిర్ధారించుకోవడం అవసరం. ఇంతకీ ఆ బాధితుడి పరిస్థితి ఎలా ఉందో చెప్పేనేలేదు కదూ. డాక్టర్లు అతడి చెవిలో బొద్దింకలను తీసేసి.. శుభ్రంగా క్లీన్ చేసి పంపించేశారు. లక్కీగా అతడికి ఎలాంటి హాని కలుగలేదు. కానీ, నిర్లక్ష్యం చేసి ఉంటే మాత్రం అతడు భయానక వ్యాధులకు గురయ్యేవాడని డాక్టర్లు తెలిపారు. కాబట్టి, బీ కేర్ ఫుల్. ఎందుకంటే.. మంచంపై పిల్లలు కూడా నిద్రపోతుంటారు. మీ నిర్లక్ష్యం వారికి శాపంగా మారొచ్చు. ఈ కథనాన్ని మీ బంధుమిత్రులతో కూడా పంచుకుని అప్రమత్తం చేయండి.


Also read : మీరు ఇలాంటి టూత్ బ్రష్ వాడుతున్నారా? జాగ్రత్త, చిక్కుల్లో పడతారు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.