Vizag Law And Order : విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఈ ఘటన విశాఖలో శాంతిభద్రతల పరిస్థితిని బయట పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ లో నిర్వహించిన బహిరంగసభలో విశాఖలో శాంతి భద్రతల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు. నేరగాళ్లు విశాఖలో అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. అయితే ఈ విమర్శలపై వైఎస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. విశాఖలో శాంతిభద్రతలు లేవని.. భూ కబ్జాలు జరుగుతున్నాయని.. ఇప్పుడు తెలిసిందా అని .. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు ఎదురుదాడి చేశారు.
అయితే వైఎస్ఆర్‌సీపీ కీలక నేతలు ఎదుురుదాడి చేసి .. కొన్ని గంటలు కాక ముందే విశాఖలో ఎంపీ కిడ్నాప్ వ్యవహారం వెలుగు చూసింది. ఎంపీ ఇంట్లోకి చొరబడిన కిడ్నాపర్లు ఏకంగా రెండు రోజుల పాటు వారిని నిర్బంధంలో ఉంచుకోవడం సంచలనం అవుతోంది.
ఈ ఘటనపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి స్పందించారు. శాంతిభద్రతలపై బీజేపీ విశాఖలో సభలో మాట్లాడితే మంత్రులు, నేతలు మీడియాలు ముందు గగ్గోలుపెట్టారు. నేడు ఏకంగా మీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు. మీ ఎంపీ కుటుంబాన్ని రక్షించలేనోళ్లు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారని ప్రశ్నించారు. తప్పును ఒప్పుకొని బిజెపి కి క్షమాపణ చెప్పి, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన రౌడీ షీటర్
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య , కుమారుడితో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేసింది రౌడీషీటర్ హేమంత్ అని పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులను కిడ్నాప్ చేసి.. డబ్బులు వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. భీమిలికి చెందిన రామకృష్ణ అనే టీడీపీ నేతలు ఇలాగే కిడ్నాప్ చేసి.. రూ. కోటి డిమాండ్ చేసిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అలాగే విజయారెడ్డి అనే మాజీ మహిళా కార్పొరేటర్ హత్య కేసులోనూ హేమంత్ నిందితుడిగా ఉన్నారు. హేమంత్.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అనుచరుడిగా చాలా కాలం ఆయన వెంటే తిరిగారని వైసీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రమే కాకుండా.. సినిమాలు నిర్మిస్తూంటారు. ఎంవీవీ సినిమాలు నిర్మిస్తున్న సమయంలో ... హేమంత్ ఆయన చుట్టూనే ఉండేవారని చెబుతున్నారు. ఎంపీగా ఎన్నికయిన తర్వాత కూడా చాలా కాలంగా ఆయన వెంటే ఉన్నారని.. తర్వాత .. ఎంపీ పేరు చెప్పి దందాలు చేస్తున్నారని దూరం పెట్టినట్లుా చెబుతున్నారు. ఈ కారణంగానే ఎంపీ కుటుంబసభ్యులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయని.. అందుకే సులువుగా కిడ్నాప్ చేయగలిగారని అంటున్నారు.