మాతృత్వం అనేది దేవుడు ఇచ్చే వరం. కొంతమంది ఆడవాళ్ళకి గర్భం దాల్చడంలో సమస్యలు తలెత్తడం వల్ల సంతానోత్పత్తి పొందలేకపోతారు. అటువంటి వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో మాతృత్వం పొందాలని చూస్తున్నారు. ఇక్కడ కూడా ఒక మహిళ అదే విధంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చింది. కానీ ఒక డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆమె తన అమ్మతనాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. వైద్యుడు చేసిన పొరపాటు ఆమె జీవితాన్ని తల్లకిందులు చేసింది. 2022 డిసెంబర్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.


పెన్సిల్వేనియాలోని క్రిస్టిన్ అనే ప్రీ స్కూల్ టీచర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం అక్కడ ఉన్న ఒక క్లినిక్ ని ఆశ్రయించింది. ఇందులో భాగంగా ఆమెకి సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రామ్ చేయాల్సి ఉంది. తన ఫెలోపియన్ ట్యూబ్ లో అడ్డంకులు ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవడం కోసం డాక్టర్ ని కలిసింది. చెక్ చేసేందుకు వైద్యుడు పొరపాటున సెలైన్ ద్రావణానికి బదులుగా యాసిడ్ ఇంజెక్షన్ చేశాడు. మొదట్లో ఆమెకి మంటగా అనిపించిందని డాక్టర్ కి చెప్పింది. ఏదో తప్పు జరిగిందని తన కడుపు మొత్తం బర్నింగ్ సెన్సేషన్ గా ఉందని చెప్పింది. కానీ డాక్టర్ ఆమె మాటలు పట్టించుకోకుండా అది కేవలం సెలైన్ మాత్రమేనని ఏమీ కాదని నచ్చ జెప్పాడు. కానీ ఈ ప్రక్రియ చేసిన తర్వాత క్రిస్టిన్ తొడలు, కాళ్ళ చుట్టు ఎర్రటి దద్దుర్లు రావడం గమనించింది. అల్ట్రాసౌండ్ టెక్నీషియన్ తో పరీక్ష చేయించుకోగా ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్ ఆమె గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేయబడిందని తేలింది. ఇది 85 శాతం పవర్ ఫుల్.


ఈ యాసిడ్ సాధారణంగా మొటిమలు తొలగించడం కోసం, చర్మం మీద ఏర్పడే మచ్చలు తొలగించేందుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అటువంటి యాసిడ్ క్రిస్టిన్ కడుపులోకి వెళ్లడంతో లోపల, వెలుపల కాలిన గాయాలు ఏర్పడ్డాయి. వాటిని తగ్గించుకోవడం కోసం ఆమె చికిత్స తీసుకుంది. ఈ ఐవీఎఫ్ చికిత్స కారణంగా ఆమె పునరుత్పత్తి అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని నెలల తర్వాత కూడా ఆమె కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ ఘటనలో అన్నీ క్లినిక్ కార్యాలయాల నుంచి ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్ తొలగించారు.


నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్లినిక్ డాక్టర్ మీద క్రిస్టిన్, ఆమె భర్త జాసన్ దావా వేశారు. ఈ ఘటనకు డాక్టర్ ని బాధ్యుడిని చేస్తూ నోటీసులు పంపించారు. దీనిపై కేసు విచారణ కొనసాగుతుంది. డాక్టర్ అశ్రద్ధ, చిన్న నిర్లక్ష్యం కారణంగా ఆమె జీవితంలో కోలుకోలేని దెబ్బ ఎదుర్కోవాల్సి వచ్చింది. పిల్లలు కనాలనే ఆమె కోరిక కోరికగానే మిగిలిపోయింది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఈ యాప్ బ్రెయిన్ స్ట్రోక్‌ను ముందే పసిగట్టి అలర్ట్ చేస్తుందట!