మీకు తెలుసా? ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు ప్రతిరోజూ సుమారు 3 కిలోలు బరువును భుజాన మోస్తున్నారు. అంత బరువు ఏమున్నాయని అనుకుంటున్నారా? అదేనండీ మన ల్యాప్ టాప్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పిల్లల స్కూల్ బ్యాగ్ మాత్రమే కాదు ల్యాప్ టాప్ బ్యాగ్ తగిలించుకోవడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్ టాప్ కనీసం రెండు కేజీల బరువు ఉంటుంది. దానితో పాటు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, అవసరమైన స్టేషనరీ వస్తువులు కూడా అదే బ్యాగ్ లో పెట్టుకుని భుజాన తగిలించుకుని ఆఫీసుకి వెళ్తూ ఉంటారు. డైలీ అంత బరువు మోస్తూ ఉండటం వెన్నెముక, మెడ, తల మీద భారం పడుతుంది.


బరువు ఎక్కువగా ఉండే స్కూల్ బ్యాగ్ లేదా ల్యాప్ టాప్ బ్యాగ్స్ నిత్యం భుజం మీద మోయడం వల్ల శరీర భంగిమలో మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కండరాలు ముఖ్యంగా భుజాలు, మెడ వెనుక భాగంలో అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. బరువైన బ్యాగులు స్థిరంగా మోయడం వల్ల దీర్ఘకాలిక మార్పులు దారి తీస్తుంది. బ్యాగ్ బరువు నుంచి వచ్చే ఒత్తిడి కీళ్ల మీద కూడా పడుతుంది. కౌమారదశలో ఉన్న వాళ్ళు భారీ బరువు ఉన్న సంచులు మోయడం వల్ల పార్శ్వగూని వంటి వెన్నెముక వైకల్యాలు కూడా దారి తీయవచ్చు. కండరాలు, స్నాయువుల మీద ప్రభావం పడుతుంది. కాలక్రమేణా ఈ సమస్యలు మస్క్యులోస్కెలెటల్ సమస్యలు వస్తాయి. అలసట, అసౌకర్యానికి దారి తీస్తుంది. మొత్తం శ్రేయస్సుని ప్రభావితం చేస్తుంది.


బరువు తగ్గించుకునే మార్గాలు


⦿ బ్యాగ్ బరువు తగ్గించుకునేందుకు ముందుగా ప్రయత్నించాలి. దానిలో మీకు అవసరమైన వాటిని మాత్రమే తీసుకెళ్లాలి. అనవసరమైన వస్తువులు తీసేయడమే మంచిది.


⦿ ప్యాడెడ్ పట్టీలు, బ్యాక్ సపోర్ట్ ఉన్న బ్యాగ్ లు ఎంచుకోవాలి. వాటి వెడల్పు బాగుండే విధంగా చూసుకోవాలి. ప్యాడెడ్ బ్యాక్ ప్యానెల్ ఉన్నవి అనుకూలంగా ఉంటాయి.


⦿ బరువైన వస్తువులు వీపుకు దగ్గరగా, తేలికైన వస్తువులు బ్యాగ్ వెలుపల ఉంచుకుంటే మంచిది. బరువును సమానంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.


⦿ బ్యాగ్ పట్టీలు రెండూ తగిలించుకోవాలి. ఒక భుజానికి మాత్రమే తగిలించుకుని ఉండటం వల్ల ఒత్తిడి ఒకవైపు అధికంగా పడుతుంది. అందుకే రెండు పట్టీలు తగిలించుకుంటే మంచిది.


⦿ వీపుకి బాగా పైకి బ్యాగ్ పట్టీలు పెట్టుకోకూడదు. బరువు ఎక్కువగా అనిపిస్తుంది. బ్యాగ్ తాళ్ళు కూర్చునే ప్రదేశానికి ఆనుకునే విధంగా అడ్జెస్ట్ చేసుకుంటే మంచిది.


⦿ నడుము, ఛాతీకి కుదిరితే పట్టీలు వేసుకోవడం వల్ల బరువు ఎక్కువగా అనిపించదు. బ్యాక్ ప్యాక్ వెయిట్ శరీర బరువులో 10-15 శాతానికి మించకూడదు.


⦿ ఎక్కువ సేపు బరువైన బ్యాగ్ తీసుకెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మధ్య మధ్యలో భుజానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది.


⦿ బ్యాగ్ బరువుని బ్యాలెన్స్ చేసేందుకు రెండు వైపులా మార్చుకుంటూ ఉండాలి.


⦿ ల్యాప్ టాప్ తో పాటు మరిన్ని వస్తువులు తీసుకెళ్లాల్సి వస్తే రోలింగ్ బ్యాగ్స్ ఉపయోగించాలి. ఇది భుజాల మీద భారాన్ని తగ్గిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: సబ్జా గింజలు శరీరానికి చల్లదనం మాత్రమే కాదు మరెన్నో ప్రయోజనాలు ఇస్తాయ్