రామ్ చరణ్ నటించిన సినిమా ధ్రువ. అందులో కథంతా జనరిక్ మందుల చుట్టే తిరుగుతుంది. అప్పుడు చాలా మందికి అవేంటో అన్న సందేహం వచ్చే ఉంటుంది. ఇవి పేదవారికి తక్కువ ఖర్చులో మందులను అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టినవి. ఇప్పుడు వంద రూపాయలు పెట్టి కొనే బ్రాండెడ్ మందు, జనరిక్ మెడికల్ స్టోర్లో కేవలం పది రూపాయలకే దొరుకుతుంది. అయినా జనరిక్ మందుల షాపుకు వెళ్లే వాళ్లు చాలా తక్కువ. బ్రాండెడ్ మందులే పనిచేస్తాయన్న అపనమ్మకం వారిలో చాలా ఉంది.నిజానికి రెండు ఔషధాలకు పెద్ద తేడా ఉండదు. రెండు ఒకేలా తయారుచేస్తారు. కాకపోతే బ్రాండెడ్ సంస్థలు తమ బ్రాండ్ పేరుతో వాటిని అమ్ముతాయి. జనరిరక్ మందులపై ఎలాంటి బ్రాండ్ నేమ్ ఉండదు.
జనరిక్ మందులు అంటే?
ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు చాలా పరిశోధనలు చేస్తాయి. కొన్నేళ్ల పాటూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాయి. అన్ని పరీక్షలు పూర్తయ్యాక వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. అవే బ్రాండెడ్ మందులు. ఆ మందు తయారీపై, ఆ ఫార్మా కంపెనీకి ఇరవై ఏళ్ల పాటూ పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ సమయంలో వేరే వాళ్లు ఆ మందును అదే ఫార్ములాతో తయారుచేయకూడదు. ఆ మందు తయారీలో చాలా ఖర్చు పెట్టామని సదరు కంపెనీ వాదిస్తుంది. ఆ సొమ్మును రాబట్టుకోవాలంటే ఆ మందును తాము మాత్రమే అమ్మాలని భావిస్తుంది. అందుకే ప్రభుత్వాలు కూడా పేటెంట్ పేరుతో ఆ హక్కును సదరు కంపెనీకి ఇస్తాయి.
ఇరవై ఏళ్ల తరువాత అదే ఫార్ములాతో ఎవరైనా ఆ మందును తయారు చేయవచ్చు. అలా అదే ఫార్ములాతో మందులు తయారుచేసి తక్కువ రేటుకే జనరిక్ మందుల షాపుల్లో అమ్ముతారు. కాకపోతే దీనిపై ఎలాంటి బ్రాండ్ నేమ్ ఉండదు. ఇలా వేరే ఫార్మా సంస్థల ఫార్ములాతో మందును తయారు చేసి తక్కువ రేటుకే పేదల కోసం అమ్మే వాటిని జనరిక్ మందులు అంటారు. వీటిని కేవలం జనరిక్ మందుల షాపుల్లోనే అమ్ముతారు.సిప్లా, ఎస్ఆర్, రెడ్డీస్... ఇవన్నీ బ్రాండెడ్ మందుల సంస్థలు.
జనరిక్ మందులు మంచివే....
చాలా మంది బ్రాండెడ్ మందులనే నమ్ముతారు. ఫార్మా సంస్థలు తమ సేల్స్ మేన్ల చేత వైద్యులు, ఆసుపత్రుల వద్దకు పంపించి బాగా ప్రమోషన్లు చేయిస్తారు. దాని వల్ల బ్రాండెడ్ మందులనే రోగులకు రాసిస్తారు వైద్యులు. నిజానికి జనరిక్ మందులు కూడా చక్కగా పనిచేస్తాయి. ఎందుకంటే జనరిక్, బ్రాండెడ్ మందుల ఫార్మూలాలు ఒక్కటే కాబట్టి. డోలో 650 ఎంజీ ఇప్పుడు బాగా అమ్ముడవుతోన్న ఔషధం. దీని ధర పది ట్యాబెట్లు రూ.30 అనుకుందాం. అదే జనరిక్ మెడికల్ షాపుల్లో ఈ పారాసెటమాల్ ధర కేవలం అయిదు రూపాయలు. కానీ దీన్ని కొనేవారు ఎంత మంది? జనరిక్ మందులు కూడా బ్రాండెడ్ మందులో సమానంగా పనిచేస్తాయి.
Also read: తేనెను ఎలా వాడితే విషపూరితమవుతుందో చెప్పిన సద్గురు, ఇలా తింటే సేఫ్
Also read: అధ్యయనాల ప్రకారం కిడ్నీల కోసం మీరు తినాల్సిన ఆహారాలు ఇవే