Rubbing  Eyes: సాధారణంగా కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు వాటిని గట్టిగా రుద్దడం, నలపడం వంటివి చేస్తూ ఉంటాము. ఇలా చేసినట్లయితే తాత్కాలికంగా కాస్త ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల మీ కళ్ళు మరింత ఎర్రగా మారి, చికాకు పెంచే అవకాశం ఉంది. అయితే కంటి దురదకు ప్రధాన కారణం ఎలర్జీ అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సీజన్ మారినప్పుడు గడ్డి పూలపై నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, దుమ్ము ధూళి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, చుండ్రు వంటివి మీ కళ్ళల్లో పడటం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని, ఫలితంగా కండ్ల కలక వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నేత్ర వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఇలాంటి ఎలర్జీలు వచ్చినప్పుడు కంటిని గట్టిగా రుద్దడం లేదా నులమటం వంటి పనులు చేయకూడదని, తాత్కాలిక ఉపశమనం కోసం చేసే ఇలాంటి పనుల వల్ల కంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కంటిని గట్టిగా రుద్దడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


కార్నియా దెబ్బతినటం:


కంటిని అదే పనిగా రుద్దడం వల్ల కార్నియా దెబ్బతినే అవకాశం ఉందని ఫలితంగా కెరటోకోనస్ వంటి నేత్ర సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 


కనురెప్పల కండరాలు బలహీనపడతాయి:


కళ్లను అదే పనిగా రుద్దినట్లయితే కనురెప్పల కండరాలు బలహీనపడే అవకాశం ఉందని నేత్ర వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా టోసిస్ అనే వ్యాధి వస్తుందని. ఈ వ్యాధి బారి నుంచి బయటపడాలంటే శస్త్ర చికిత్స సైతం చేయించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


కళ్ల మంటలు పెరుగుతాయి:


కళ్ళను అదేపనిగా రుద్దినట్లయితే కళ్ళల్లో మంట మరింత పెరుగుతుందని ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని నేత్ర వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా కళ్ళు ఎర్రగా మారుతాయి అని, ఈ పరిస్థితి కారణంగా చూపు సైతం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 


కళ్ళను రుద్దడం నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి?


ఎలర్జీ కారకాలను గుర్తించండి:


మీ కంటి దురదకు కారణమైన ఎలర్జీ కారకాలను గుర్తించి వాటిని మీ ప్రదేశంలో లేకుండా నివారించినట్లయితే.. ఎలర్జీ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


కంటి చుక్కలు వాడటం:


ఒకవేళ మీ కళ్లు దురద పెడుతున్నట్లయితే.. గట్టి నలపడం మానేయండి. ఈ పరిస్థితి నుంచి మీరు బయట పడాలంటే కళ్లను లూబ్రికేట్ చేసే కంటి చుక్కల మందును వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. 



కంటి శుభ్రతను పాటించండి:


మీ కంటికి దురద కలిగినట్లయితే వెంటనే మంచినీటితో కళ్ళను కడుక్కొని శుభ్రమైన గుడ్డతో తుడుచుకొన్నట్లయితే సగం ఇన్ఫెక్షన్ తగ్గుతుందని, దురద బారి నుంచి బయటపడవచ్చు అని నేత్ర వైద్యులు చెబుతున్నారు. మీకు కంటి దురద రెగ్యులర్ గా ఉన్నట్లయితే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. 


Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!


Disclaimer: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.