ఎంత కష్టపడి సంపాదించినా కొంతమందికి డబ్బులు జేబులో మిగలవు. అలా మిగలకపోవడానికి వారికున్న కొన్ని అలవాట్లే కారణం.ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, నెలకు లక్షలు సంపాదిస్తున్నా కూడా నెలాఖరుకు ఎవరినో ఒకరిని అడిగే పరిస్థితి వస్తుంది. అలాంటి స్థితిలో విధిని తిట్టుకోకండి, మీకున్న చెడు అలవాట్లను తిట్టుకోండి. కింద మేము చెప్పిన అలవాట్లు మీకుంటే వాటిని మార్చుకోండి. ఇవి మిమ్మల్ని సంపన్నులను చేయవు, సరికదా మరింతగా డబ్బుకు ఇబ్బంది పడేలా చేస్తాయి. చివరకు మిమ్మల్ని పేదవారిగా మార్చేస్తాయి.
అవసరం లేకపోయినా ఆన్‌లైన్ షాపింగ్‌లు
క్రెడిట్ కార్డుల ద్వారా లేదా యూపీఐ పద్ధతుల ద్వారా చెల్లింపు చేయడం అలవాటయ్యాక అతిగా ఆన్ లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. కాస్త ఖాళీ దొరికిన ఈ-కామర్స్ సైట్లు ఓపెన్ చేసి ఏదో ఒకటి కొనేయడం చేస్తున్నారు. దీనివల్ల బ్యాంకు ఖాతా త్వరగానే ఖాళీ అవుతుంది. భవిష్యత్తు కోసం దాచుకునే మొత్తం తగ్గుతుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలంటే ముందుగా మీ ఫోన్ లో ఈ కామర్స్ సైట్ల యాప్‌లను డిలీట్ చేసేయండి. సమయం దొరికితే పుస్తకాలు చదువుకోవడం వంటివి చేయండి.
క్యాబ్ బుకింగ్‌లు
కొంతమంది చిన్నచిన్న దూరాలు ప్రయాణించేందుకు కూడా క్యాబ్‌లు, ఆటోలు బుక్ చేసుకుంటారు.దానికి బదులు నడుచుకుంటూ వెళితే ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బులు కూడా మిగులు. మీరే ఆలోచించండి.
ఈ విషయంలో జాగ్రత్త తప్పదు...
కూరగాయలు, పప్పుదినుసులు తెచ్చే ముందు ఎంత అవసరమో అంతే తెచ్చుకోండి. అధికంగా తెచ్చి పెట్టడం, అవి పాడయ్యాక పడేయడం, మళ్లీ కొనుక్కోవడం... ఈ పద్ధతి చాలా ఇళ్లల్లో కొనసాగుతోంది. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునేవారు ఈ విషయంలో ప్రణాళిక ప్రకారం వెళ్లాలి.
బయట తినడం...
నెలకోసారి బయట తిన్నా ఫర్వాలేదు కానీ కొంతమంది వారానికి రెండు, మూడు సార్లు బయటే తింటారు. రెస్టారెంట్ కి వెళితే చాలా ఖర్చవుతుంది. ఆన్‌లైన్ ఆర్డర్లు కూడా పెరిగిపోయాయి. ఇవి డబ్బును వృధా చేయడమే కాదు, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇంట్లో వండుకునే ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలి. ఖర్చు తగ్గుతుంది, ఆరోగ్యం లభిస్తుంది.
మద్యపానం, ధూమపానం
ఈ రెండు అలవాట్లు మీకుంటే మీ జేబు ఖాళీ అవడం ఖాయం. ఎందుకంటే వీటి ధరలు మామూలుగా ఉండవు. రోజూ మద్యపానం అలవాటున్నవారికి అధికంగా ఖర్చవుతుంది. అలాగే సిగరెట్ ధరలు కూడా చాలా అధికం. ఈ రెండూ అలవాట్లు వదిలేస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు మిగలడం ఖాయం.
Also read: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో మీకు కనిపిస్తున్న నెంబర్ ఎంత? మీ కంటి చూపుకు ఇది సవాలే