Brain Tumor: మనిషి మెదడు శరీరంలోని మానసిక, శారీరక విధులను నియంత్రించే ఒక క్లిష్టమైన, ముఖ్యమైన అవయవం. దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే మెదడులో కణితులు ఏర్పడడం అనేది ఇప్పుడు ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. దీనినే బ్రెయిన్ ట్యూమర్ అంటారు. మెదడులో కణితులు ఏర్పడడం మొదలయ్యాక ప్రాథమికంగా ఎలాంటి లక్షణాలు పెద్దగా కనిపించవు. చాలా చిన్నచిన్న సంకేతాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. అలాంటి వాటిల్లో తలనొప్పి ఒకటి. కానీ సాధారణంగా తలనొప్పి అందరికీ వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోరు. నిరంతరాయంగా తలనొప్పి వస్తూ ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. కచ్చితంగా బ్రెయిన్ ట్యూమర్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కంటి చూపులో మార్పులు వచ్చినా కూడా మెదడులో కణితులు ఉన్నాయేమో అని చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది.


అస్పష్టమైన దృష్టి, వస్తువులు రెండుగా కనిపించడం, దృష్టిని క్రమంగా కోల్పోవడం అనేది బ్రెయిన్ ట్యూమర్ లో ప్రధాన లక్షణాలు. తీవ్రంగా అలసట పొందడం కూడా బ్రెయిన్ ట్యూమర్ సంకేతమే. కంటి నరాలను మెదడులో ఏర్పడిన కణితులు ప్రభావితం చేస్తాయి. దీనివల్ల దృష్టిలోపాలు వస్తాయి. కాబట్టి తలనొప్పి, కంటి చూపు మందగించడం వంటివి తేలిగ్గా తీసుకోవాల్సిన అంశాలు కావు.


మూర్ఛ తరచూ రావడం కూడా మెదడు కణితుల వల్ల కావచ్చు. మూర్చలు వచ్చినప్పుడు వాటిని తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. మెదడులో కణితులు ఏర్పడితే అవి అభిజ్ఞా సామర్ధ్యాన్ని, మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచన నైపుణ్యాలు తగ్గుతాయి. మూడ్ స్వింగ్స్ ఎక్కువవుతాయి. చిరాకు పెరుగుతుంది. అసాధారణ ప్రవర్తనలు ఎక్కువవుతాయి. నిరంతరం వికారం, వాంతులు వస్తూ ఉంటాయి. జీర్ణాశయాంతర సమస్యలు లేనప్పుడు కూడా వికారం, వాంతులు అధికమవుతాయి. దీనికి కారణం మెదడు కణితి వల్ల శరీరం పై పడే ఒత్తిడి. ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వాటిని బ్రెయిన్ ట్యూమర్ హెచ్చరికగా భావించాలి.


మెదడులో కనితులు శరీరంలోని ఇంద్రియాల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. తిమ్మిరి పట్టడం, జలదరింపులు రావడం వంటివి కలుగుతాయి. మెదడులో కణితులు వచ్చిన ప్రాంతాన్ని బట్టి శరీరంలో మార్పులు కనిపిస్తాయి. కొన్ని రకాల పరీక్షల ద్వారా మెదడులో ట్యూమర్లు పెరుగుతున్నాయో లేవో నిర్ధారిస్తారు వైద్యులు. దాన్నిబట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.



Also read: అలాంటి భర్తతో సంసారం చేసేదెలా? ఏం చేయాలో అర్థం కావడం లేదు



Also read: పిల్లలకే కాదు పెద్దవారు కూడా కచ్చితంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇవిగో






































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.