తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీ అభిమానులు ఎక్కువ. హైదరాబాద్‌లో అయితే మరి చెప్పక్కర్లేదు, రోజూ బిర్యానీలు తినేవారున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీకి లవర్స్ ఎక్కువ. బిర్యానీ వాసనకే నోరూరిపోతుంది చాలా మందికి. కంటికి ఇంపుగా కనిపించే బిర్యానీలు మనసును లాగేస్తాయి. అయితే కొంతమంది రాత్రిపూట పొట్టనిండా బిర్యానీలు తింటారు. బిర్యానీలు తరచూ తినడమే అనారోగ్యకరం. అలాంటిది రాత్రిపూట తింటే మరీ అనర్థం. నిద్ర కూడా సరిగా పట్టదు. పొట్ట పెరిగిపోతుంది. ఎసిడిటీ పెరిగిపోతుంది. ఇంకా ఎన్నో ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


తరచూ బిర్యానీని తినడం వల్ల వెంటనే ప్రభావం కనిపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో మాత్రం కచ్చితంగా ప్రభావం కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. బిర్యానీలో నూనెను ఎక్కువ శాతం వాడతారు. అలాగే రకరకాల మసాలాలు అధికంగా దట్టిస్తారు. కాబట్టి బిర్యానీని అధికంగా తింటే ప్రేగులకు, అలాగే మొత్తం జీర్ణవ్యవస్థకు హాని కలగడం ఖాయం. ప్రతికూల ప్రభావాలు ఒక్కోసారి నాలుగైదు రోజులకే అజీర్తి రూపంలో బయటపడతాయి. కొందరిలో మాత్రం ఏళ్ల తరువాత పెద్ద అనారోగ్య సమస్యగా బహిర్గతమవుతాయి. కాబట్టి బిర్యానీని వారానికోసారి మాత్రమే తింటే మంచిది. 


నిషేధిత రంగులు
కొందరు బిర్యానీకి మంచి రంగు రావడం కోసం ఆర్టిఫిషియల్ రంగును వాడతారు. ఆహార సంస్థలు నిషేధించిన రంగులను కూడా రెస్టారెంట్ల వారు వాడుతున్నారు. అందులో ఒకటి టర్ ట్రాజెన్ కూడా ఒకటి. ఇది సింథటిక్ తో తయారయ్యే ఓ రసాయనం. నీటిలో ఇట్టే కరిగిపోతుంది. బిర్యానీ వండాక చివర్లో రంగు కోసం చల్లుతారు. చికెన్ తందూరీలో కూడా దీన్ని అధికంగా వాడుతారు. టర్ ట్రాజెన్ తినడం వల్ల చాలా ప్రమాదకరమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఆస్తమా, దద్దుర్లు, క్యాన్సర్ వంటివి రావచ్చని చెబుతున్నారు నిపుణులు. అందుకే బిర్యానీని తినడం తగ్గించాలి. 


Also read:  ఈ అయిదు వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే