ప్రపంచంలో ఎవరికైనా ఇష్టమైన ప్రదేశం వారి ఇల్లే. ఇంటి కన్నా సురక్షితమైన ప్రదేశం మరొకటి లేదని ఫీలయ్యే వారు కూడా అధికమే. ఎవరి జీవితంలోనైనా ఇంటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇల్లే కాదు, ఇంట్లో ఉండే వస్తువులు కూడా మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఇంట్లో ఉండే కొన్ని ఉత్పత్తుల వల్ల మన ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అవేంటంటే...


ఎయిర్ ఫ్రెషనర్లు
ఇంట్లో ఏదైనా వాసన కొంచెం వచ్చినా కొందరికి నచ్చదు. వెంటనే ఎయిర్ ప్రెషనర్లు తీసి ఇల్లంతా స్ప్రే చేస్తారు. కానీ అలా చేయడం వల్ల మీ ఆరోగ్యం రిస్క్‌లో పడినట్టే. ఎయిర ఫ్రెషనర్లలో ఇథనాల్, ఫార్మల్డెహైడ్, బీటా పినెన్... వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి గాలిలో కలిసి మన శ్వాసలోకి చేరే అవకాశం ఉంది. అలా జరిగితే ఆస్తమా, తలనొప్పి, డెర్మటైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


టాయిలెట్ క్లీనర్లు
టాయిలెట్ క్లీనర్లలో చాలా గాఢమైన రసాయనాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే టాయిలెట్లలోని మరకలు ఇట్టే పోతాయి. అక్కడ ఉండే ప్రమాదకరమైన సూక్ష్మజీవులను కూడా చంపేస్తాయి. అందుకే వాటిని తెగవాడతారు ఇంట్లో. ఈ క్లీనర్లలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మం, కళ్లపై ప్రభావం చూపిస్తాయి. వాటిని ఉపయోగించాక చర్మం, కళ్లు మంటగా అనిపిస్తాయి. శ్వాసకోశ సమస్యలు కూడా కలుగుతాయి. 


ఫ్లేమ్ రిటార్డెంట్స్
ప్రతి ఇంట్లో సోఫాలు, కార్పెట్లు, మంచాలు ఉంటాయి. వాటి తయారీలో ‘ఫ్లేమ్ రిటార్డెంట్లు’ ఉపయోగిస్తారు. వీటిని ‘అగ్ని నిరోధకాలు’ అంటారు.ఇంట్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు అధిక మంటలు చెలరేగకుండా ఇవి ఉపయోగపడతాయి. కానీ ఆ రిటార్డెంట్లలో విషపూరితన రసాయనాలు వాడతారు. వీటి వల్ల హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్, నరాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 


నాన్ స్టిక్ కుక్‌వేర్
ప్రతి ఇంట్లోనూ నాన్ స్టిక్ వంట సామాను కచ్చితంగా ఉంటుంది. కానీ వాటిపై టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. టెఫ్లాన్ ను ‘పాలీటెట్రాఫోరోఎథిలిన్’అని కూడా అంటారు. దీనిపై వండేటప్పడు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఫరవాలేదు కానీ 260 డిగ్రీల దాటి వండితే మాత్రం ప్రమాదం. 260డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వండాక, ఆ ఆహారాన్ని తింటే తలనొప్పి, వికారం వంటివి సమస్యలు మొదలవుతాయి. 


పెయింట్లు, పాలిష్ డబ్బాలు
గోడలు, ఫర్నిచర్ అందంగా కనిపించేందుకు పెయింట్ వేస్తారు. చమురు ఆధారిత పెయింట్లు, పాలిష్‌లు హానికరమైన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అవి గాలిలో కలిస్తాయి. ఆ గాలిని పీల్చడం వల్ల వికారం, కళ్లు, చర్మం, గోళ్లు, గొంతులో చికాకుగా అనిపించడం, శ్వాస సమస్యలు ఏర్పడడం జరుగుతాయి. కాబట్టి ఇంట్లో వీటిని ఉంచుకునేకన్నా, ఇంటికి దూరంగా పెరట్లో ఉంచితే మంచిది. 


Also read: ఆ మూడు రోజులు పెరుగు తినకూడదా? ఆ వాదనలో నిజమెంత?


Also read: మీకు చిత్రంలో పెదవులు కనిపిస్తున్నాయా లేక చెట్లు, వేర్లు కనిపిస్తున్నాయా? దాన్ని బట్టి మీరెలాంటివారో చెప్పేయచ్చు