ఇంటి పనులు బయట పనుల్లో పడి మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించరు. అందువల్లే పురుషులతో పోలిస్తే ఆడవాళ్లే ఎక్కువగా అనారోగ్యానికి గురి అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ  ఆరోగ్యంపై మహిళలు మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనేక అధ్యయనాలు పరిశీలించిన నిపుణులు మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటాడానికి కెరొటీనాయిడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని అంటున్నారు.


మహిళలు పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి. వీటిలో కెరొటీనాయిడ్స్ ఎక్కువగా లభిస్తాయి. వృద్ధాప్య సంకేతాలను దూరం చేయడంతో పాటు దీర్ఘాయువును అందిస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుందని న్యూట్రీషనల్ న్యూరో సైన్స్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యత వల్ల కూడా అనేక రోగాలు ఇబ్బంది పెడతాయి. హార్మోన్ల సమస్య తలెత్తి మానసిక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. దీని ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మహిళల్లో హార్మోన్ స్థాయిలు, హెచ్చుతగ్గులు చాలా మిశ్రమంగా ఉంటాయి. ఇది వారి మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. మెదడు చురుగ్గా పని చెయ్యడం, పీరియడ్స్, గర్భధారణ వంటి వాటి మీద హార్మోన్లు తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే హార్మోన్లు అసమతుల్యత ఏర్పడితే ఇవన్నీ ఎఫ్ఫెక్ట్ అవుతాయి.


కెరొటీనాయిడ్స్ వల్ల ప్రయోజనాలు


మహిళల్లో ఎముకల బలం చాలా తక్కువగా ఉంటుంది. 30-40 సంవత్సరాల మధ్యలో అది మరి ఎక్కువగా కనిపిస్తుందని సదరు పరిశోధనలో బయటపడింది. దాని వల్ల బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ కు గురయ్యే ప్రమాదానికి దారి తీస్తుందని పరిశోధనలో పేర్కొన్నారు. లైకోపీన్ (టమోటాలలో లభిస్తుంది), బీటా కెరోటిన్ (క్యారెట్‌లలో లభిస్తుంది) జియాక్సంథిన్ (గుడ్లలో లభిస్తుంది) వంటి కెరోటినాయిడ్లు ఎముకల క్షీణతను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయని అధ్యయనం వెల్లడించింది. కెరొటీనాయిడ్స్ డిమెన్షియా, అల్జీమర్స్ కు వ్యతిరేకంగా కూడా పని చేస్తుంది. సప్లిమెంట్స్ ద్వారా కెరొటీనాయిడ్స్ పొందడం కంటే తాజా కూరగాయలు, పండ్ల వల్ల వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.


కెరొటీనాయిడ్స్ లభించే ప్రధాన వనరులు


☀ బచ్చలి కూర


☀ బ్రకోలి


☀ బఠానీలు   


వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గా పరిగణించబడే ల్యూటిన్ అధికంగా ఉంటుంది. ఇవే కాకుండా కాలానుగుణంగా వచ్చే పండ్లు నారింజ, కర్బూజ, కివీ, రెడ్ పెప్పర్స్, కోడి గుడ్డు, ద్రాక్ష వంటి వాటిలో జియాక్సంథిన్‌ ఉంటుంది. ఇది కంటి, మెదడు పనితీరుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఆహారం నుంచే కెరొటీనాయిడ్స్ పొందినప్పటికి ల్యూటిన్, జియాక్సంథిన్‌ కోసం వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్స్ కూడా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: రోజూ జీడిపప్పు తింటే పురుషుల్లో ఆ సమస్యలన్నీ దూరం, మరెన్నో ప్రయోజనాలు!


Also Read: ఈ ఆహారాలను కలిపి తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం, స్మోకింగ్ చేసేవాళ్లకు మరింత డేంజర్!