భారతీయుల్లో ఉదయాన లేచాక టీ, కాఫీ సేవించాకే ఏ పనైనా మొదలుపెట్టే వాళ్ళు ఎక్కువమంది. టీ, కాఫీలు మితంగా తాగితే ఆరోగ్యకరమే కానీ ఇందులో ఉండే కెఫిన్ మాత్రం ఒక్కోసారి ఆరోగ్యానికి హాని చేస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు కెఫీన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు. వారు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం దాల్చిన చెక్కతో చేసిన పానీయం ప్రతిరోజూ తాగితే రక్తంలో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
దాల్చిన చెక్క మంచి సువాసన వేస్తుంది. చిన్న ముక్కను టీలో వేసుకున్న చాలు మసాలా టీ అదిరిపోతుంది. అయితే పాలతో చేసిన టీని పక్కన పెట్టి దాల్చిన చెక్కతో టీను తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే ఖాళీ పొట్టతో దాల్చిన చెక్క పానీయాన్ని తీసుకుంటే మధుమేహ రోగులు ఆరోగ్యంగా జీవిస్తారు. ఇది చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకుంటుంది. గుండెకు కూడా ఈ దాల్చిన చెక్క పానీయం ఎంతో సహాయపడుతుంది.
శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కూడా మధుమేహం గుండె జబ్బులు వంటివి వస్తాయి. అలా కొవ్వు పేరుకుపోకుండా చేసే శక్తి దాల్చిన చెక్కకు ఉంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటుంది. దీన్ని తాగేవారు బరువు త్వరగా తగ్గుతారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అంటువ్యాధులు త్వరగా సోకే కాలంలో జీవిస్తున్నాం. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి అనారోగ్య పరిస్థితులను అయినా దూరం పెట్టడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. దాల్చిన చెక్క మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. పిల్లలకు ఈ పానీయాన్ని తాగించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చదివింది వారికి గుర్తుంటుంది. అలాగే పెద్దలు ఆర్థరైటిస్ వంటి సమస్యలు బారిన పడకుండా ఈ దాల్చిన చెక్క పానీయాన్ని తాగవచ్చు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
తయారు చేయడం చాలా సులువు. ఒక గిన్నెలో గ్లాసు నీరు వేయాలి. అందులో దాల్చిన చెక్క వేసి చిన్న మంట మీద పది నిమిషాలు మరిగించాలి. దాల్చిన చెక్కలోని పోషకాలు అన్ని నీటిలో చేరుతాయి. దాన్ని వడకట్టి గోరువెచ్చగా మారాక ఆ నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. దీన్ని ప్రతిరోజు తాగుతూ ఉంటే ఎంతో ఆరోగ్యం.
Also read: మగవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే మొదట కనిపించే లక్షణాలు ఇవే