క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా పాకి పోతోంది. మన దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యంగా పురుషులు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారు. పొగాకు, సిగరెట్లు వంటివి అధికంగా తాగుతున్న పురుషులు ఇలా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పాసివ్ స్మోకింగ్ అంటే ధూమపానం చేసిన వారి పక్కన నిలుచుని ఆ పొగ పీల్చిన వారిలో కూడా ఈ క్యాన్సర్ లక్షణాలు బయట పడుతున్నాయి. ధూమపానం చేసేవారు మాత్రమే కాదు ధూమపానం చేయని వారు కూడా దీనివల్ల లంగ్స్ క్యాన్సర్‌కి బలవుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లోనే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా బయటపడుతుంది. ఈ క్యాన్సర్ వస్తే కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినప్పుడు నిరంతరంగా దగ్గు వస్తుంది. ఛాతీలో సన్నటి నొప్పి కనిపిస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. గొంతు బొంగురు పోయినట్టు అవుతుంది. స్వరం కూడా మారుతుంది. మెడ దగ్గర వాపు కనిపిస్తుంది. హఠాత్తుగా బరువు తగ్గిపోతారు. దగ్గినప్పుడు వచ్చే కఫంలో రక్తం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలగానే చెప్పుకోవాలి.
దగ్గు వారం రోజులు కంటే ఎక్కువ కాలం ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వెంటనే వైద్యులను కలవడం అవసరం. దగ్గినప్పుడు ఛాతిలో నొప్పి రావడం, అసౌకర్యంగా అనిపించడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ గానే భావించాలని చెబుతున్నారు వైద్యులు. బరువు హఠాత్తుగా తగ్గిపోయేసరికి చాలామంది ఆనందిస్తారు. కానీ బరువు హఠాత్తుగా తగ్గడం అనేది అనారోగ్య సంకేతం. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎక్కువ కాలం సమయం పడుతుంది. ఒక నెలలోపే బరువు తగ్గిపోయారంటే మీకేదో అనారోగ్యం ఉందని అర్థం చేసుకోవాలి.
కొందరికి ఊపిరి పీల్చడం కష్టం అయిపోతుంది. ఇలా ఎక్కువ కాలం పాటు శ్వాస సరిగా ఆడకపోతే వెంటనే వైద్యులను కలిసి టెస్టు చేయించుకోవడం ఉత్తమం. దగ్గుతున్నప్పుడు శ్లేష్మంతో పాటు రక్తం కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవండి. రక్తం పడటం అనేది చాలా ప్రమాదకరమైన సంకేతం. మీ గొంతు మారిపోయిన కూడా ప్రమాదకరమైన లక్షణంగానే భావించాలి. మీ వాయు మార్గంలో క్యాన్సర్ కణాల పెరుగుదల వల్లే ఇలా గొంతు బొంగురు పోవడం, స్వరంలో మార్పు రావడం జరుగుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఉపరితల క్యాన్సర్ ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి వారసులు జాగ్రత్తగా ఉండాలి. పొగాకును వాడడం మానేయాలి.
Also read: ఈ లడ్డూ పిల్లలకు రోజుకొకటి తినిపించండి చాలు, ప్రొటీన్ లోపమే రాదు