వేసవి వేడి వల్ల మాములుగా అందరికీ కచ్చితంగా నీరసంగా ఉండడం, డీహైడ్రేట్ అయిపోవడం వంటి చిన్నచిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి. మరి డయాబెటిస్ దీర్ఘకాలికంగా వేధించే సమస్య. ఈ సమస్య శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చ్చే సామార్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. మనం తీసుకున్న ఆహారంలోని పిండిపదార్థాన్ని గ్లూకోజ్ గా మార్చి రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ పెరిగినపుడు పాంక్రియాస్ ఇన్సులిన్ ను స్రవిస్తుంది. ఇన్సులిన్ సమక్షంలో గ్లూకోజ్ శక్తిగా మారుతుంది. అయితే డయాబెటిక్స్ లో ఇన్సులిన్ పనితీరు సమర్థవంతంగా ఉండకపోవడం లేదా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వంటి కారణాలతో రక్తంలో అదనంగా గ్లూకోజ్ మిగిలిపోతుంది.


వేసవిలో ఏం జరుగుతుంది?


బయటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నపుడు టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారు మూడు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. తీవ్రమైన హైపోగ్లైసీమియా, డయాబెటిక్ కీటో ఆసిడోసిస్, లేదా అకస్మిక కార్డియాక్ అరెస్ట్ లేదా వెంట్రిక్యులార్ అరిథ్మియా వంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.


డయాబెటిస్ తో బాధపడేవారు తేలికగా డీహైడ్రేషన్ కు గురవుతారు. హైడ్రేషన్ ప్రక్రియ సరిగ్గా లేకపోతే రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోవచ్చు. ఫలితంగా మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. ఇది మరింత డీహైడ్రేషన్ కు కారణం కావచ్చు. కేవలం డీహైడ్రేషన్ ఒక్కటే డయాబెటిక్స్ ను బాధపెట్టే విషయం కాదు. చెమటకు కారణమయ్యే నాడులు దెబ్బతినటం వల్ల తగినంత చెమట రాకపోవడం వల్ల శరీరంలో వేడి పెరిగిపోయి అలసటగా ఉంటుంది.


విపరీతమైన వేడి వల్ల ఇన్సులిన్, ఇతర డయాబెటిస్ మందుల సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. కనుక వీటిని చల్లని ప్రదేశాల్లో నిల్వచెయ్యడం అవసరం.


వేసవి లో హైపోగ్లైసీమియా ప్రభావం కూడా పెరుగుతుంది. వేడిలో చెమటలు పట్టడం, నీరసంగా ఉండడం సర్వసాధారణం కావడం మూలంగా లక్షణాలు గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది. గ్లూకోజ్ మాత్రలు, చక్కెర పానీయాల వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. వేసవిలో ఇన్సులిన్ డోసేజుల సర్దుబాటు కూడా అవసరం పడవచ్చు.


కొన్ని ముఖ్యమైన సూచనలు



  • డీహైడ్రేషన్ ను నివారించేందకు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. మద్యం తీసుకునే అలవాటు ఉంటే వేసవిలో మానేయ్యడం మంచిది.

  • గాలాడేందుకు వీలుగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

  • వేడిగా ఉండే మధ్యాహ్న సమయాల్లో వీలైనంత వరకు శ్రమ కలిగించే పనులు చెయ్యకూడదు. ఇలాంటి పనులు ఉదయం లేదా సాయంత్రాలు చేసుకోవడం మంచిది.

  • శరీర వేడిని సంతులన పరిచేందుకు చన్నీటి స్నానం మంచిది.

  • బయటికి వెళ్లాల్సి వస్తే వెంట గ్లూకాగాన్ ఎమర్జెన్సీ కిట్ తోపాటు గ్లూకోజ్ వెంటనే అందించే గ్లూకోజ్ బిల్లలు వంటివి వెంట ఉంచుకోవాలి.

  • వేడి, అలసట, హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చెయ్యొద్దు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

  • తరచుగా గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించుకుంటూ ఉండాలి.

  • డయాబెటిక్ న్యూరోపతితో బాధపడే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

  • చెప్పులు లేకుండా వేడిగా ఉన్న నేల మీద నడిస్తే కాలిన గాయాలు ఏర్పడవచ్చు.

  • బ్లడ్ షుగర్ పరీక్షించే సమయంలో చల్లగా, నీడగా ఉన్న ప్రదేశాల్లో ఉండాలి. టెస్టింగ్ స్ట్రిప్స్ ప్రత్యక్షంగా ఎండ పడకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.


Also read : రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పటికైనా టైమ్ మార్చుకోండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.