Dengue Fever: డెంగ్యూ.. బయటకు కనిపించకుండానే నిలువెత్తు మనిషిని కుంగదీసే భయానక వ్యాధి. వర్షాలు వస్తున్నాయంటే.. ప్రజల్లో భయాన్ని పుట్టించే ఈ మహమ్మారి ఇప్పుడు లాటిన్ అమెరికాను వణికిస్తోంది. ఈసారి మరింత ప్రమాదకరంగా మారిన డెంగ్యూ.. ఇండియాలో అలజడికి సిద్ధమైంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి.. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు పాటించాలి. ఏ లక్షణాలు కనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి.
లాటిన్ అమెరికా ఇప్పటివరకు గతంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత ఘోరమైన డెంగ్యూ జ్వరం కేసులను ఎదుర్కొంటోంది. పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. 2024 మొదటి 4 నెలల్లో డెంగ్యూ కేసులు గత సంవత్సరం ఇదే సీజన్‌తో పోలిస్తే 238 శాతం పెరిగాయి. రికార్డు స్థాయిలో 4.1 మిలియన్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత కేసులు ఐదేళ్ల సగటు కంటే 400 శాతం ఎక్కువ. ఎల్‌నినో క్లయిమేట్ వల్ల తడి, వేడి, దోమలు వృద్ధి చెందడానికి, వైరస్ మరింత వ్యాప్తి చెందే పరిస్థితులను సృష్టించింది.
వాతావరణ మార్పు వల్ల దోమలతో వ్యాపించే రోగాలు పెరుగుతున్నాయి. డెంగ్యూ.. నాలుగు రకాల వైరస్‌ల వల్ల వచ్చే వైరల్ ఫీవర్. ఇది దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక ఉష్ణమండల ప్రాంతాలలో సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఇతర వాతావరణ పరిస్థితులలో కూడా సంతానోత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. డెంగ్యూ జ్వరాన్ని మోసే దోమలు ఈడెస్ ఈజిప్టి రకానికి చెందినవి. ఈ దోమలు అమెరికాలోని దక్షిణ భాగాలలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి.
డెంగ్యూ లక్షణాలు:
అధిక జ్వరం:
డెంగ్యూ జ్వరం లక్షణాలలో ఒకటి అకస్మాత్తుగా అధిక జ్వరం రావడం కనిపిస్తుంది. సాధారణంగా ఇది 2 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. జ్వరం తరచుగా తీవ్రమైన చెమట, చలితో కూడి ఉంటుంది.
తీవ్రమైన తలనొప్పి:
డెంగ్యూ జ్వరం తరచుగా తీవ్రమైన తలనొప్పితో కూడి ఉంటుంది. ఇది బలహీనంగా మారుతుంది.
కళ్ల నొప్పి:
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు కళ్ల నొప్పిని అనుభవిస్తారు. దీనిని రెట్రో-ఆర్బిటల్ నొప్పి అంటారు. ఈ లక్షణం తరచుగా కంటి కదలికల ద్వారా తీవ్రమవుతుంది.
డెంగ్యూ జ్వరం తీవ్రమైన కండరాలు, కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. దీనిని బ్రేక్‌బోన్ ఫీవర్ అని అంటారు.
మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి చిట్కాలు:
మస్కిటో రెపెల్లెంట్స్ వాడండి:
డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి అత్యంత సులభమైన మార్గం మస్కిటో రెపెల్లెంట్స్ ఉపయోగించడమే అని నిపుణులు చెబుతున్నారు. మస్కిటో రెపెల్లెంట్స్ క్రీములు రోజుకు 3 సార్లు కంటే ఎక్కువ వాడకూడదు, సాధారణంగా బ్రాండ్‌ను బట్టి వీటి రక్షణ వ్యవధి మారుతుంది.
ఫుల్ స్లీవ్ బట్టలు ధరించండి:
మిమ్మల్ని పూర్తిగా కప్పి ఉంచే పూర్తి దుస్తులను ధరించండి. చెప్పులకు బదులుగా పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంటు, షూస్ ధరించండి.
కిటికీలు, తలుపులు మూసి ఉంచండి:
డెంగ్యూ వైరస్‌లను మోసే దోమలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు చాలా చురుకుగా ఉంటాయి. ఈ వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
పరిసరాలను శుభ్రంగా ఉంచండి:
డస్ట్‌బిన్‌లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దోమలను నివారించేందుకు పరిసరాల్లో మురుగు నీరు లేకుండా చూసుకోవాలి. నీరు నిలువ ఉన్నా సరే.. డెంగ్యూ దోమలు పెరిగిపోతాయి. కాబట్టి, టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు తదితరాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.