Men fertility : సంతానోత్పత్తిపై వయస్సు వల్ల కలిగే సమస్యలు, ప్రభావాలను తగ్గించడానికి స్త్రీలు, పురుషులు ఇద్దరు ఒక నిర్దిష్ట వయస్సు కంటే ముందే పిల్లలను కనాలి. ఇది తెలివైన పని. ఎందుకంటే పరిమిత సంఖ్యలో అండాలతో జన్మించిన స్త్రీల వలే కాకుండా.. పురుషులు ప్రతిరోజూ కొత్త స్మెర్మ్ ను ఉత్పత్తి చేస్తారు. వృషణాలు ప్రతిరోజూ 100 నుంచి 200 మిలియన్ల వరకు తాజా స్పెర్మ్ ఉత్పత్తి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంటే పురుషుల వయస్సు పెరిగే కొద్దీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే ప్రమాదం తక్కువే. కానీ.. పర్యావరణం, జీవనశైలి మార్పులు, అనారోగ్యాలు వంటివి పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య సమస్యలు కూడా స్పెర్మ్ ఉత్పత్తికి లేదా స్ఖలనం ప్రక్రియకు అడ్డంకిగా మారుతాయి. వీటిలో ఎపిడిడైమిటిస్ వంటి అంటువ్యాధులు, వేరికోసెల్ వంటి శరీర నిర్మాణ సమస్యలు, స్పెర్మ్ విడుదల చేయడంలో సమస్యలను కలిగిస్తాయి. పురుష పునరుత్పత్తి అవయవాలు అసాధారణ అభివృద్ధికి కారణమయ్యే క్రోమోజోమ్ లోపాలు, అంగస్తంభన, అకాల స్కలనం లేదా ఇబ్బందికరమైన సంభోగం వంటి లైంగిక సమస్యలు, డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇవ్వన్నీ కూడా సంతానోత్పత్తి తగ్గడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు పర్యావరణం, కుటుంబ నేపథ్యం వంటి కారకాలు కూడా సంతానోత్పత్తి క్షీణతకు దోహదం చేస్తాయి. టెస్టోస్టెరాన్ రీప్లేస్ మెంట్ థెరపీ, కెమోథెరపీ, రేడియేషన్ వంటి క్యాన్సర్ చికిత్సలు, కొన్ని యాంటీ ఫంగల్ మెడిసిన్, అల్సర్ మందులు కూడా స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. హెర్నియా సమస్యలు, స్క్రోటల్ లేదా వృషణ శస్త్ర చికిత్సలు, ప్రొస్టేట్ సర్జరీలు, వేసెక్టమీలు వంటివి కూడా స్మెర్మ్ మార్గాన్ని అడ్డుకుంటాయి. ఇవే కాదు పారిశ్రామిక రసాయనాలు, భారీ లోహాలు, రేడియేషన్ ప్రభావం కూడా సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
మగవారి సంతానోత్పత్తిలో లైఫ్ స్టైల్ కీలక పాత్ర పోషిస్తుంది. అనాబాలిక్ స్టెరాయిడ్స్, కొకైన్, గంజాయి వంటి డ్రగ్స్ వాడకం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి. వీటితోపాటు ఊబకాయం నేరుగా స్పెర్మ్ ను ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు అనేది సంతానోత్పత్తిని ప్రభావితం చేసే హార్మోన్ల మార్పులకు కారణం అవుతుంది. మహిళల వలే పురుషుల వయస్సు సంతానోత్పత్తి క్షీణతకు కారణం కానప్పటికీ వయస్సు కూడా చాలా కీలకమైంది.
పురుషుల వయస్సు పెరిగే కొద్దీ గర్భం దాల్చే సమయం పెరుగుతుందని..గర్భధారణ రేటు కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 30 ఏళ్ల లోపు పురుషులతోపోల్చితే 40 ఏళ్లు పై బడిన పురుషులు ఏడాదిలోపు గర్భం దాల్చే అవకాశం 30శాతం తక్కువగా ఉంటుంది. 45 ఏళ్ల పైబడిన పురుషుల్లో గర్భం దాల్చే సగటు సమయం 25 ఏళ్ల లోపు పురుషుల కంటే 5 రేట్లు ఎక్కువగా ఉంటుంది. 35 ఏళ్ల పైబడిన పురుషులు 25 శాతం గర్భధారణ రేటును కలిగి ఉంటే 35 ఏళ్ల లోపు పురుషులకు 52 శాతం రేటు ఉంటుంది.
Also Read : కసిగా 10 వేల అడుగులు టార్గెట్ పెట్టుకుని నడిచేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవు, ఈ టిప్స్ పాటించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.