వేసవి వచ్చిందంటే శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. దీని వలన శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. సమయానికి నీరు తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల మూర్చలు, మూత్రపిండాల వైఫల్యం, కోమా వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. శరీరం తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడితే మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి ఈ సమస్యను తక్కువగా తీసుకోవద్ద. వేసవిలో దాహం వేసినా, వేయకపోయినా ప్రతిగంటకు గుక్కెడు నీళ్లు తాగడం చాలా ముఖ్యం.


డీహైడ్రేషన్ వల్ల పెద్ద పేగుపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చెబుతున్నారు ఆరోగ్యా నిపుణులు. పెద్ద పేగు అనేది జీర్ణవ్యవస్థలోని చివరి విభాగం. పేగులు ప్రతిరోజు ఒక లీటరు కంటే ఎక్కువ ద్రవాన్ని గ్రహిస్తాయి. పేగులోని వ్యర్థాలను ఆ ద్రవం సాయంతో బయటికి పంపేందుకు ప్రయత్నిస్తాయి. ఆ వ్యర్థాలే మలం. పెద్దపేగుకు తగినంత నీరు అందకపోతే మలం గట్టిపడుతుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల పేగులలో తీవ్ర సమస్యలు రావచ్చు. నీటి కొరత కారణంగా పేగుల పనితీరు నెమ్మదిగా మారడమే కాదు కొన్నిసార్లు ఆగిపోతుంది కూడా.


ఈ లక్షణాలు కనిపిస్తే
శరీరం డిహైడ్రేషన్ బారిన పడితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. నీరు మీ పేగులలో ఆహార కదలికలను చురుకుగా చేస్తుంది. తగినంత నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడి పేగుల్లోని ఆహారం చురుగ్గా కదలదు. అప్పుడు పెద్ద పేగు మీరు తినే ఆహారంలోని నీటినే పీల్చేసుకుంటుంది దీని వల్ల జీర్ణసమస్యలు వస్తాయి.  ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం తగినంత నీరు తీసుకోకపోతే పొట్టలో పుండ్లు, అల్సర్లు, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జీర్ణ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడానికి పొట్టలో తగినంత నీరు అవసరం. 


శరీరం డీహైడ్రేషన్  బారిన పడితే మలం సాధారణంగా కాకుండా బంకగా వస్తుంది. అది దీర్ఘకాలిక జీర్ణ రుగ్మతకు లక్షణం. శరీరంలో తగినంత నీరు లేకపోయినా, కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారాన్ని తిన్నా కూడా ఇలాగే జరుగుతుంది. ఇవి రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 


నీరు తగినంత తాగకపోతే ఆ ప్రభావం చర్మంపైన కూడా పడుతుంది. చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం, ముడతలు పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన అలసట వేధిస్తుంది. నిద్ర సరిగా పట్టదు. కాబట్టి రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి.



Also read: మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉన్న నీళ్లలో మునకలేస్తే ఆర్థరైటిస్ మాయం, ఇదే క్రయోథెరపీ



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.