హిందీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేరుగా హిందీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. తెలుగులో ప్రభాస్ హీరోగా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఛత్రపతి’ని, బెల్లంకొండ హీరోగా హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే హిందీ ‘ఛత్రపతి’కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో అదుర్స్ అనిపిస్తున్నాయి. శ్రీనివాస్ యాక్టింగ్, వినాయక్ టేకింగ్ కు ప్రేక్షకులు అబ్బురపడుతున్నారు.
ఫస్ట్ సినిమా హిట్ అయినా రెండేళ్లు నటనకు దూరం
తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్ని ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించారు. అప్పట్లో తనతో నటించేందుకు కొంత మంది హీరోయిన్లు కూడా ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ‘అల్లుడు శీను’ సినిమాతో శ్రీనివాస్ హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఆ సినిమా విజయం సాధించినా, శ్రీనివాస్ మళ్లీ వెండితెరపై కనిపించడానికి దాదాపు మరో రెండేళ్లు పట్టింది. తన జీవితంలో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరించాడు.
ఆర్థిక ఇబ్బందులతో అవకాశాలను తిరస్కరించా- బెల్లకొండ
“మా నాన్న నిర్మాత కావడం వల్లనే సినిమాల్లోకి ఈజీగా రాగలిగానని అందరూ అనుకుంటున్నారు. అది నిజమేనని. దానికంటే ఎక్కువ కష్టపడి పని చేయడం వల్లే పరిశ్రమలో కొనసాగుతున్నాను. నా మొదటి సినిమా ‘అల్లుడు శీను’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమాకు మా నాన్న నిర్మాతగా ఉన్నారు. నన్ను చాలా ప్రోత్సహించారు. ఈ సినిమాలో నాతో నటించేందుకు సమంత, తమన్నా ఒప్పుకోలేదు. డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ ఒక్కొక్కటి 5 నిమిషాల డెమో వీడియోలను చేసి వారికి పంపించాను. ఆ వీడియో చూసి స్టార్ హీరోయిన్లిద్దరూ సినిమా చేయడానికి అంగీకరించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అప్పటికే మా ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నాన్న నిర్మించి పంపిణీ చేసిన కొన్ని సినిమాలు నష్టాలను తెచ్చిపెట్టాయి. తనపై ఒత్తిడి పెరగడంతో తనకు వచ్చిన చాలా అవకాశాలను తిరస్కరించాను. ఏడాదిన్నర పాటు ఇంట్లోనే కూర్చున్నాను. ఆ తర్వాత తక్కువ బడ్జెట్‌తో రెండో సినిమా చేశాను. నాపై నమ్మకం ఉంచి బోయపాటి శ్రీను ‘జయ జానకి నాయక’ సినిమా చేశారు. ఈ సినిమాతో నేను ఇండస్ట్రీలో నిలబడ్డాను” అని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు.
మే 12న 'ఛత్రపతి' విడుదల
తెలుగులో విడుదలైన 'ఛత్రపతి' సినిమా బ్యాక్ డ్రాప్ ని మార్చి, యాక్షన్ ఎంటర్ టైనర్ గా హిందీ 'ఛత్రపతి'ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ, శరద్ కేల్కర్, శివం పాటిల్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పెన్ స్టూడియోస్ పతాకంపై ధవల్ జయంతి లాల్ గడ, అక్షయ్ జయంతి లాల్ గడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తనిష్క్ బాఘ్చి, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ గా మారుతుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మే 12న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.