ఈ రోజు ఉదయం 08:30 నిమిషాలకు ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి, సగటు సముద్ర మట్టం నుండి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు కొనసాగుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మే 8వ తేదీ ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 09న వాయుగుండంగా కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత, దాదాపు ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపుకి కదులుతూ తీవ్రతరం అయ్యి తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 


అల్పపీడనంగా మారిన తరువాత ఈ తుపాను యొక్క దిశ, వేగం, తీవ్రత, ప్రయాణించే మార్గం మొదలైన వివరాలు లభిస్తాయని తెలిపారు. దీని ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రం అంతటా 9వ తేదీ వరకూ వాతావరణం చల్లగా ఉండనుంది. 9 నుంచి పొడి వాతావరణం ఏర్పడి, 9వ తేదీ నుండి గరిష్ట  ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలో కొన్ని చోట్ల సుమారుగా 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సుమారుగా 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. నేడు దిగువ స్థాయిలో గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములు, వడగండ్లతో ఈదురు గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 81 శాతం నమోదైంది.


ఏపీలో నేడు వాతావరణం ఇలా
నేడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేగంగా గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. 


‘‘కర్నూలు జిల్లా పశ్చిమ భాగాల్లో భారీ పిడుగులు, వర్షాలు మొదలయ్యాయి. ఇది మరో మూడు గంటల్లో మరిత పెరిగి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని వివిధ భాగాలకి విస్తరించనుంది. మూడు గంటల తర్వాత సత్యసాయి జిల్లాలో కూడా వర్షాలకు అకకాశాలున్నాయి. రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశాలు మే 8 రాత్రి బాగా కనిపిస్తుంది.


విజయవాడకి చాలా దగ్గరగా వర్షాలు వచ్చి బలహీన పడ్డాయి. నిన్నటి వర్షాలు తూర్పు నుంచి వచ్చాయి.. కానీ నేడు మాత్రం అవి మెల్లగా ఉత్తర వాయవ్య భాగం నుంచి రావడం వలన వర్షాలకి తగినంత బలం దక్కలేదు. ఒకటి మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి ఇది వేసవి కాలం. ఈ కాలంలో వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. అది కూడా చాలా వేగంగా బలపడుతుంది అలాగే చాలా వేగంగా బలహీనపడుతుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.