సిరామిక్, గ్లాస్, మెటల్ కప్పుల్లో కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. కానీ ఆఫీసు, బయట ఎక్కడైనా కాఫీ లేదా టీని డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లోనే ఇస్తారు. తాగేసిన వెంటనే వాటిని చెత్త బుట్టలో వేస్తారు. ప్లాస్టిక్ కప్పులతో పోలిస్తే ఈ కప్పులు ఆరోగ్యానికి అంతగా హాని చేయవని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. పైగా పర్యావరణానికి కూడా మంచిదే అనే ప్రచారం ఉంది. కానీ ఇవి కూడా అనారోగ్యకరమైనవేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కప్పుల లోపలి భాగంలో కూడా ప్లాస్టిక్ పూత పూస్తారు. వేడి పదార్థాలు అందులో పోయడం వల్ల ఆ ప్లాస్టిక్ కరిగి ద్రవాలలోకి చేరిపోతుంది.


ప్లాస్టిక్ పూతతో కూడిన డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో ఇతర హానికరమైన పదార్థాలతో పాటు వేలాది చిన్న ప్లాస్టిక్ కణాలు ద్రవంలోకి విడుదల అవుతాయి. ఒక వ్యక్తి పేపర్ కప్పులో మూడు కప్పుల టీ లేదా కాఫీ తాగితే 75,000 మైక్రోప్లాస్టిక్ కణాలను తీసుకుంటున్నట్టే. ప్లాస్టిక్ వాడకం ఎంత హానికరమో అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వస్తువులు లేదా మరొకటి తరచుగా ఉపయోగించడం వల్ల మన శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ లు ప్రవేశిస్తున్నాయని హెచ్చరికలు చేస్తూనే ఉంటున్నారు. అందుకే చాలా దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నాయి. ఇప్పుడు పేపర్ కప్పులు కూడా ఇదే జాబితాలోకి చెరిపోయాయి. టీ, కాఫీ, వేడి వేడి సూప్ వంటి పానీయాల కోసం ఉపయోగించే పేపర్ కప్పుల వాడకంపైనా ఆందోళనలు తలెత్తుతున్నాయి.


పేపర్ కప్పు వల్ల ప్రమాదాలు


పేపర్ కప్పుల్లో కూడా కొద్ది మొత్తంలో ప్లాస్టిక్ ఉంటుంది. అందులో వేడి టీ లేదా కాఫీ తాగడం వల్ల వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఉంది. గట్ సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ పూతతో చేసిన్ పేపర్ కప్స్ లో వేడి పదార్థాలు పోయడం వల్ల అందులోని హానికర రసాయనాలు డ్రింక్  లోకి చేరిపోతాయి. ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు దీని గురించి వివరించారు. 15 నిమిషాల పాటు వేడి ద్రవాలు ప్లాస్టిక్ పూతతో ఉన్న డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో పోయడం వల్ల అందులోని 25,000 చిన్న ప్లాస్టిక్ కణాలు, హానికరమైన ఆయాన్లు, భారీ లోహాలు ద్రవంలోకి విడుదల అవుతాయని కనుగొన్నారు.


ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్ మరియు సల్ఫేట్ వంటి అయాన్లు, విషపూరిత భారీ లోహాలు అందులో ఉన్నాయి. ఇక కాఫీ లేదా టీ లో ఉంటే నీటి నమూనాల్లో సీసం, క్రోమియం, కాడ్మియం, ఆర్సెనిక్ ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. అంటే రోజూ తీసుకునే మూడు కప్పుల టీ లేదా కాఫీ తాగే సగటు వ్యక్తి 75,000 మైక్రోప్లాస్టిక్ కణాలను తీసుకుంటున్నాడు. రోజువారీ కాఫీతో పాటు మైక్రోప్లాస్టిక్, భారీ లోహాలు తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు, గట్ సమస్యలు, క్యాన్సర్, నరాల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.


శీతల పానీయాలు తాగొచ్చు


అయితే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన శీతల పానీయాలు పేపర్ కప్పుల్లో తాగితే సురక్షితమేనని అంటున్నారు. వీటిలో ఎటువంటి ప్లాస్టిక్ రేణువులు లేవని అధ్యయనం కనుగొంది.


ఇంట్లో కాకుండా బయట కాఫీ తాగాలని అనుకుంటే పేపర్ కప్స్ కి బదులుగా సిలికాన్ లేదా గ్లాస్ కప్పుల్లో తీసుకోవడం మంచిది. ఇది  మీ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు తీసుకురాదని నిపుణులు చెబుతున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుకుంటున్నట్టే