కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. మొదటి వేవ్, రెండో వేవ్... ఇప్పుడు మూడో వేవ్, ఇంకెన్ని వేవ్‌లు వస్తాయో ఎవరికీ తెలియదు. కొత్త వేరియంట్లు కూడా ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఏకంగా పిల్ల వేరియంట్లను కూడా పుట్టించేసి చాప కింద నీరులా పాకేస్తోంది. మనదేశంలో పరిస్థితి ఇలా ఉంటే దాని పుట్టినిల్లు అదేనండి చైనాలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. వైరస్ భయానికి చాలా మంది కూరగాయలు కొనేందుకు కూడా భయపడుతున్నారు. కూరగాయలపై కూడా వైరస్ కొన్ని గంటల పాటూ ఉంటుందని వారి నమ్మకం. అందుకే అక్కడ  కూరగాయల ధరలే కాదు, అమ్మకాలు కూడా దారుణంగా పడిపోయాయి. 


చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో పరిస్థితి మరీ దిగజారింది. కూరగాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయల్లాంటివి అమ్ముడవ్వడం లేదు. కొనుగోలుదారులు కూరగాయలు వైరస్ రహితమైనవని రిపోర్టు చూపిస్తేనే కొంటామని చెబుతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అక్కడి స్థానిక ప్రభుత్వం స్పందించి కూరగాయలకు కరోనా టెస్టులు చేయిస్తోంది. న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షలను నిర్వహిస్తోంది. అధికారులు పంటలు ఉన్న చోటికి, మార్కెట్లకు వెళ్లి మరీ ఈ పరీక్షలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా చైనాలోని సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. అక్కడి పాపులర్ సోషల్ మీడియా సీనా వీబో. ఇందులో ఇప్పుడిదే హాట్ టాపిక్. కూరగాయలకు పరీక్షలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు తెగ షేర్ అవుతున్నాయి. 


అక్కడి నెటిజన్లు దీనిపై రకరకాలు స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ ‘నేను చూసిన అతి వినోదాత్మకమైన కోవిడ్ టెస్టు ఇదే’ అని కామెంట్ చేయగా మరొకరు ‘అమ్మేవాళ్లు, కొనేవాళ్లు ఇద్దరూ అతి జాగ్రత్తపరులు, అయినా వైరస్ తెచ్చుకునే కన్నా పరీక్షలు చేయడం ఉత్తమమైన పద్ధతి’ అని అభిప్రాయపడ్డారు. చైనాలో పలుచోట్ల కొత్త కేసులు వస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇలా కూరగాయలు కొనాలన్న భయపడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్, షాంఘై, టియాంజిన్ నగరాల్లో కేసులు సంఖ్య పెరగుతోందని సమాచారం. 


కరోనా వైరస్ ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతున్నట్టు ఇంతవరకు ఏ అధ్యయనం తేల్చలేదు. పొట్లాల్లో కట్టిన ఆహారాన్ని తింటే ఆ పొట్లాల ద్వారా కరోనా రావచ్చేమో కానీ, ఆహారం ద్వారా వచ్చినట్టు ఎక్కడా రికార్డుల్లో లేదు. నీటిని కూడా స్థానిక ప్రభుత్వం శుధ్ది చేసి క్రిమిసంహారకమందులు చల్లి పంపిణీ చేస్తుంది. కాబట్టి కరోనా నీటి ద్వారా సంక్రమించిన దాఖలాలు లేవు.


Also read: టాటూ వేయించుకుంటున్నారా? అయితే వేయించుకోవడానికి ముందు, తరువాత ఈ పనులు చేయకూడదు


Also read: కాఫీ ప్రియులకు శుభవార్త... ఆ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే సత్తా కాఫీకే ఉంది, వెల్లడించిన కొత్త అధ్యయనం