నిజామాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌పై మంగళవారం టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేయడం ఉద్రిక్త పరిణామాలకు దారి తీసింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగింది. కర్రలు, బండలతో ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. ఈ దాడితో ఎంపీ అరవింద్ కారు పూర్తిగా ధ్వంసం అయింది. మంగళవారం ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడారు. తనపై దాడికి కారణం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ అని ఆరోపించారు. దాడిలో పాల్గొన్న వారంతా టీఆర్‌ఎస్ నేతలేనని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో తనను నేరుగా ఎదుర్కోలేకనే టీఆర్ఎస్ పార్టీ దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఆ హీన సంస్కృతికి టీఆర్ఎస్ పాటిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అరవింద్, టీఆర్ఎస్ పార్టీ నేత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను 50 వేల మెజార్టీతో ఓడించబోతున్నానని ప్రతిజ్ఞ చేశారు. ముందు దమ్ముంటే వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ నుంచి టికెట్ తెచ్చుకోవాలని సవాలు విసిరారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ దాడిని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని అరవింద్ అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఇక రోజులు దగ్గరపడ్డాయని అర్వింద్ వ్యాఖ్యానించారు. తనపై దాడులకు పాల్పడ్డది టీఆర్ఎస్ నేతలే అని అర్వింద్ ఆరోపించారు. వారు కేటీఆర్‌తో దిగిన ఫోటోలను మీడియాకు చూపించారు.
మంగళవారం నిజామాబాద్ జిల్లాలో నందిపేట్ మండలం నూత్ పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అర్వింద్ వెళ్తుండగా ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో అర్వింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా బాహాబాహీకి దిగాయి. ఇరువర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను వెళ్లగొట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్మూర్‌లో బీజేపీ నేతలు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన అర్వింద్.. సుమారు 200 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమకు అడ్డు తగిలారని.. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి పడేశారని ఆరోపించారు. ఈ విషయంపై సీపీ, ఏసీపీలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని అన్నారు. పోలీసులే దగ్గరుండి తమ వాహనాలపై దాడి చేయించారని అర్వింద్ ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తాము పదేపదే చెబుతున్నామని.. ఈ రోజు కూడా అదే రుజువైందని అన్నారు. ఈ ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని.. తమ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని ధర్మపురి అర్వింద్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని ఆరోపిస్తూ పోలీస్ కమిషనర్‌కు ధర్మపురి అర్వింద్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కోరారు.