నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు వివాదం తారాస్థాయికి చేరుకుంటోంది. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకోస్తానని అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆ హామీని పూర్తిగా మర్చిపోయారని పసుపు రైతులు కొన్ని రోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లయినా ఇంకా ఇచ్చిన హామీని నెరవేర్చట్లేదని పసుపు రైతులు ఆరోపిస్తున్నారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానన్న హామీతో ఎన్నికల్లో గెలిచి పసుపు బోర్డు అంశాన్ని మరుగున పడేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తెచ్చేవరకు అరవింద్ ను గ్రామాల్లో తిరగనివ్వబోమని పసుపు రైతులు హెచ్చరిస్తున్నారు.


ఆర్మూర్ నియోజకవర్గంలోని చిన యానాం, నడకూడ, దేగాం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వెళ్లిన అరవింద్ ను రానివ్వకుండా పసుపు రైతులు ఆయా గ్రామాల్లో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. అరవింద్ రాకుండా అడ్డుకునేందుకు ముందస్తుగా ట్రాక్టర్ టైర్లు అడ్డంగా పెట్టి అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అలెర్ట్ అయ్యారు. వివాదం చెలరెేగే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో మోహరించారు.


ఊళ్లోకి వెళ్తే సమస్య వస్తుంందని ఎంపీ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును తప్పుబట్టిన ఎంపీ అరవింద్ ఆర్మూర్ ని పెర్కిట్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. అరవింద్ తిరిగి వెళ్లిపోవాలంటూ పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. రెండు గంటల పాటు ధర్నా చేసిన తర్వా అరవింద్ ఇస్సాపల్లికి బయలు దేరారు. పసుపు రైతులు అడ్డుకుంటారన్న సమాచారం అరవింద్ కు పోలీసులు ముందస్తుగా సమాచారం ఇచ్చినా పట్టించుకోకుండా వెళ్లారని తెలుస్తోంది.


ఇస్సాపల్లికి బయల‌్దేరిన అరవింద్ ను గ్రామంలోకి రాకుండా పసుపు రైతులు, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ దాడిలో ఎంపీ అరవింద్ కాన్వాయ్ లోని రెండు కార్ల అద్దాలు పగుల గొట్టారు ఆందోళనకారులు. ఈ బాహాబాహీలో పలువురికి గాయాలయ్యాయ్. పోలీసులు నచ్చజెప్పడంతో అరవింద్ అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్ సీపీ కార్యాలయానికి వచ్చారు. జరిగిన సంఘటనపై ఎంపీ అరవింద్ ఫిర్యాదు చేశారు. 


పోలీసుల వైఖరిపై అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తమపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులకు పోలీసులు సహకరించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తానని సవాల్ విసిరారు. ఈ దాడి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే జరిగిందని అరవింద్ ఆరోపించారు. ఈ దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్ ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు