పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌లో ఓ వ్యక్తి తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు. ఆ తర్వాత అతడి కళ్లు చింత నిప్పుల్లా ఎర్రగా మారిపోయాయి. అతడికి ఏం జరిగిందో తెలుసుకొనే లోపే.. కళ్ల నుంచి రక్తస్రావం జరిగింది. అంతే.. కొన్ని గంటల్లోనే అతడు ప్రాణాలు విడించాడు. వైద్య పరీక్షల్లో అతడి మరణానికి గల కారణాన్ని తెలుసుకుని డాక్టర్లు షాకయ్యారు. ఇంతకీ అతడికి ఏమైంది?


బాధితుడు అంటువ్యాధితో చనిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఎబోలాను పోలి ఉండే క్రిమియాన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ వల్ల ఈ వ్యక్తి మరణించాడట. ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఐదోవంతు కంటే ఎక్కువ మంది రక్తస్రావంతో మరణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కాంగో ఫీవర్ అనే ఒక బ్యాడ్ బగ్ ఆఫ్రికా ప్రాంతంలో కనిపించడం ఈ ఏడాది ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. సెనెగల్ కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్ 21న మొదటి కాంగో ఫీవర్ కేసును దృవీకరించింది.


35 సంవత్సరాల వయసున్న వ్యక్తి పది రోజులుగా ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడ్డాడని, రక్తస్రావం మొదలైన తర్వాత జరిపిన పరీక్షల్లో ఈ కాంగో ఫీవర్ బగ్ బయట పడిందని నివేదికల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 22న అతడు మరణించాడు.


కాంగో ఫీవర్ వైరస్ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి. ఇది సాధారణంగా పేలు, పశువుల ద్వారా సంక్రమిస్తుంది. మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపించవచ్చు. వైరస్ బారిన పడిన వ్యక్తి శరీర ద్రవాలు, రక్తం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ప్రధాన వాహకాలు మాత్రం హైలోమా అనే పేలు.


దీన్ని చివరిసారిగా ఉగాండాలో జూన్ 2022లో కనుగొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ వ్యాధి వ్యాప్తి గురించి ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 35 కేసులు నమోదు కాగా 32 మరణాలు జరిగాయని అధికారులు నివేదికలో వెల్లడించారు.


లక్షణాలు ఎలా ఉంటాయి?


సంక్రిమిత పేను కాటు లేదా పసువుల నుంచి వైరస్ సోకిన తర్వాత మూడు రోజుల్లో ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ అకస్మాత్తుగా బయటపడతాయట.



  • జ్వరం

  • కండరాల నొప్పులు

  • తలతిరగడం

  • మెడనొప్పి

  • తలనొప్పి

  • గొంతునొప్పి

  • కాంతి చూడలేకపోవడం

  • వాంతులు, విరేచనాలు

  • కడుపులో నొప్పి

  • గొంతులో మంట

  • తర్వాత రెండు నుంచి నాలుగు రోజుల్లో మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూషన్, అతినిద్ర, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.


ఇవే కాకుండా గుండె వేగంగా కొట్టుకోవడం, దద్దుర్లు, చర్మం లోపల రక్త స్రావపు గుర్తులు, ముక్కు నుంచి, చిగుళ్లో రక్తస్రావం ఉంటాయి. వ్యాధి ముదిరిన తర్వాత అకస్మాత్తుగా కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫేయిల్యూర్, హార్ట్ ఫేయిల్యూర్ తో మరణిస్తారు.


కాంగో ఫీవర్ లో మూడింట ఒక వంతు కేసులు ప్రాణాంతకంగా మారుతాయి. అనారోగ్యం మొదలైన రెండు వారాల్లో మరణానికి కారణం అవుతుంది. ఇది ఆఫ్రీకా, మిడిల్ ఈస్ట్, తూర్పు ఐరోపా, ఆసీయాల్లో ఎక్కువగా కనిపించేది. ఈ మధ్య కాలంలో రష్యా, టర్కీ, ఇరాన్, అల్బేనియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలో కూడా దీని వ్యాప్తి కనిపిస్తోందని అంటున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.