బిగువైన దుస్తులు వేసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఇప్పటి వరకు కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వాటి వల్ల కలిగే అనార్థాల గురించి కూడా వివరించాయి. అయితే, టైట్ జీన్స్ ధరించడం వల్ల సెల్ల్యూలాయిట్ అనే సమస్యను పరిష్కరించవచ్చే ప్రచారం ఉంది. దీనిపై అధ్యయనం జరిపిన పరిశోధకులు కీలక విషయాలు తెలిపారు.ద


సెల్ల్యులాయిట్‌ అంటే?


సెల్ల్యులాయిట్ అంటే అదొక స్కిన్ కండీషన్ గా చెప్పుకోవచ్చు. తొడలు, పిరుదులు, పొట్ట భాగం దగ్గర చర్మం ముడతులు పడినట్టుగా, ముద్దలుగా ఉంటుంది. ఇలాంటి స్థితినే సెల్యులాయిట్ అంటారు.


సెల్యూలాయిట్ ప్రమాదకరం కాదు. కానీ చాలా మందికి దీని నుంచి విముక్తి కావాలని ఉంటుంది. ఇది ఎందుకు ఏర్పడుతుందో చెప్పడానికి ఇప్పటివరకు కారణాలు తెలియరాలేదు. కానీ చాలా వరకు చికిత్సలన్నీ కూడా తాత్కాలికంగానే పనిచేస్తాయి. దీనికి శాశ్వత పరిష్కారం పెద్దగా లేదనే చెప్పాలి. చాలా మంది అంత శాస్త్ర బద్ధం కానీ చికిత్సలు చేయించుకుని ప్రమాదాల్లో కూడా పడుతుంటారు.


ఈ సెల్యూలాయిట్ కి సంబంధించిన అపోహలను గురించి నిపుణులు వివరాలు అందిస్తున్నారు. అవగాహన కలిగి ఉంటే ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆవివరాలు ఇక్కడ తెలుసుకుందాం.


టైట్ జీన్స్ ధరిస్తే సెల్యూలైట్ నయమవుతుందా?


చర్మాన్ని నున్నగా ఉంచేందుకు బిగుతైన దుస్తులు ధరించడం మంచి ఆలోచన అనుకుంటారు చాలా మంది. కానీ  బిగుతైన జీన్స్ ధరించడం వల్ల సెల్యూలైట్ సమస్య మరింత ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా అధ్యయనాలు ఒంట్లో నీరు ఎక్కువగా నిలువ ఉండడం వల్ల సెల్యూలైట్ ఏర్పడుతుందని సూచించాయి. అంతేకాదు కాళ్లలోకి రక్తప్రసరణ తగ్గించేలా ఉండే దుస్తులు ధరిస్తే ప్రమాదం మరింత ఎక్కువవుతుందని కూడ నిపుణులు హెచ్చిరిస్తున్నారు.


లైపోసాక్షన్ తో సెల్యూలైట్ దూరం చెయ్యవచ్చు


శరీరంలో ఎక్కువైన కొవ్వు తొలగించే కాస్మెటిక్ సర్జరి. కొవ్వు తొలగించడం సెల్యూలైట్ తొలగించడమే కదా అనిపిస్తుంది. కానీ అందుకు వ్యతిరేక ఫలితాలు కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి సెల్యూలైట్ సమస్య మరింత పెరుగుతుంది కూడా అని హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు లైపో తర్వాత చర్మం కింద ఉన్న కొవ్వు తొలగి పోవడం వల్ల చర్మం సాగినట్లుగా వేలాడినట్టు మరింత అంద విహీనంగా కనబడే ప్రమాదం కూడా ఉంటుంది.


స్త్రీ పురుషులిద్దరికీ సెల్యులైట్ సమస్య రావచ్చు


మహిళల్లో సెల్యూలైట్ సమస్య ఎక్కువ. కారణం స్త్రీ పురుషుల్లో హార్మోన్ల తేడా ఉంటుంది కాబట్టి స్త్రీలలో సమస్య ఎక్కువ. పురుషుల్లో కేవలం పది శాతం మంది మాత్రమే ఈ సమస్యతో బాధపడుతుంటారు. కానీ స్త్రీలలో ఇది 90 శాతం కంటే ఎక్కువే. మహిళల్లో క్రాస్ హేచింగ్ కొల్లాజెన్ ఫైబర్స్ తక్కువగా ఉండడమే ఇందకు కారణమట. క్రాస్ హాచింగ్ కొల్లాజెన్ అనేది చర్మాన్ని దృఢంగా ఉంచేందుకు అవసరమైన కనెక్టివ్ టిష్యూ. ఇది బలహీనమైనపుడు సెల్యూలైట్, చర్మం మీద ముడతలు ఏర్పడుతాయి. సెల్యూలైట్ తరచుగా హర్మోన్ల మార్పులతో ముఖ్యంగా ఈస్ట్రోజన్ పనితీరు తో ముడిపడి ఉంటుంది. ఈస్ట్రోజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు కొల్లాజెన్ ఉత్పత్తిలో తగ్గుదలకు కారణమవుతాయి. అందువల్ల సెల్యూలైట్ ఏర్పడవచ్చు.


పరిష్కారం లేదా?


బరువు ఎక్కువగా ఉన్న వారు బరువు తగ్గడం వల్ సెల్యూలైట్ నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవన శైలీ, ఆహార విహారాలతో మంచి ఫలితాలు పొందవచ్చు. వ్యాయామం కొవ్వు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు కండరాలను కూడా బలోపేతం చేస్తుంది. అందువల్ల మంచి రూపం సాధ్యపడుతుంది. కొన్ని సార్లు లేజర్ థెరపీతో ఈ సమస్యను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. చర్మం కింద ఉన్న ఈ కొవ్వు లంప్స్ ను విచ్చిన్నం చెయ్యడంలో లెజర్ థెరపి మంచి ఫలితాలను ఇస్తుందట. చర్మం కూడా బిగుతుగా మారుతుందట. అయితే ఈ థెరపీ తో పాటు బరువు తగ్గే వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించడం కూడా అవసరమే.