Gut–Kidney Connection : జపాన్ నుంచి వచ్చిన తాజా రెండో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు వైద్య వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. సాధారణంగా మలబద్ధకం నివారణకు వాడే లుబిప్రోస్టోన్ అనే మందు.. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD) ఉన్న రోగుల్లో మూత్రపిండాల పనితీరు క్షీణతను నెమ్మదింపజేస్తుందని ఈ అధ్యయనం హైలెట్ చేసింది.
న్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌కు చెందిన పిల్లల నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కనవ్ ఆనంద్ దీని గురించి మాట్లాడుతూ.. భారతదేశంలో వైద్యులు సంవత్సరాలుగా గమనిస్తున్న పేగులు–మూత్రపిండాల మధ్య ఉన్న సంబంధాన్ని ఈ పరిశోధన బలపరుస్తోందన్నారు. అలాగే ఈ అంశం గురించిన వివిధ, సున్నితమైన విషయాలు చెప్పారు.
పేగులు–మూత్రపిండాల అనుబంధం
పేగులు, మూత్రపిండాలు ఒకదానితో ఒకటి గాఢంగా ముడిపడి ఉంటాయి. ఈ విషయం తెలియక మలబద్ధకాన్ని చిన్న సమస్యగా భావించి.. చాలామంది దానిని పెద్దగా పట్టించుకోరు. అయితే మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే పేగుల్లో టాక్సిన్స్ పెరిగి.. అవి రక్తం ద్వారా మూత్రపిండాలను దెబ్బతీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల CKD ఉన్నవారిలో మూత్రపిండాల నష్టం వేగంగా పెరుగుతుంది.
జపాన్‌లో చేసిన అధ్యయనం ఏమి చెబుతోంది?
తోహోకు యూనివర్సిటీ నిర్వహించిన ఈ రెండో దశ ట్రయల్‌లో మితమైన CKD ఉన్న 150 మంది పెద్దలను 24 వారాల పాటు పరిశీలించారు. (కేవలం పెద్దవారిపైనే ట్రయల్స్ జరిగాయి. పిల్లలపై జరగలేదు). దీనిలో భాగంగా ఈ 150 మందిని రెండు గ్రూప్‌లుగా విడదీసి.. ఒక గ్రూప్‌కు ప్లేసిబో, మరో గ్రూప్‌కు లుబిప్రోస్టోన్ ఇచ్చారు.
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ముఖ్యంగా రెండు అంశాలపై దృష్టి పెట్టారు. పేగుల నుంచి ఉత్పన్నమయ్యే హానికర టాక్సిన్స్ స్థాయిలు, మూత్రపిండాల పనితీరును కొలిచే eGFR రిజల్ట్స్‌పై దృష్టి సారించారు.
ఫలితాలు ఎలా ఉన్నాయంటే
ప్లేసిబో, లుబిప్రోస్టేన్ ఉపయోగించిన వారిలో టాక్సిన్ స్థాయిల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. కానీ లుబిప్రోస్టోన్ తీసుకున్నవారిలో eGFR క్షీణత గణనీయంగా నెమ్మదిగా జరిగినట్లు గుర్తించారు. అంటే ఈ మందు మూత్రపిండాల పనితీరును పూర్తిగా తిరిగి మెరుగుపరచకపోయినా.. క్షీణతను ఆలస్యం చేయగలదని ఈ అధ్యయనం సూచిస్తోంది. దీంతో మలబద్ధకానికి చికిత్స చేయడం ద్వారా మూత్రపిండాలను రక్షించవచ్చని చూపించిన మొదటి క్లినికల్ ఆధారం ఇదే.
మందు ఎలా పనిచేస్తుందంటే..
లుబిప్రోస్టోన్ కేవలం మలబద్ధకాన్ని తగ్గించడమే కాకుండా.. పేగుల సూక్ష్మజీవుల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. మైటోకాండ్రియాల ఆరోగ్యానికి సంబంధించిన స్పెర్మిడిన్ అనే సహజ అణువు స్థాయిలను పెంచుతుంది. ఇది మూత్రపిండ కణాలకు శక్తినిచ్చి, వాటి పనితీరుకు మద్దతు ఇస్తుంది.
ఇండియాలో పిల్లల్లో ఎందుకు ఇది కీలకం?
డాక్టర్ ఆనంద్ ప్రకారం.. భారతదేశంలో CKD ఉన్న పిల్లల్లో మలబద్ధకం చాలా సాధారణం. దానికి ఆహారంలో మార్పులు, ఫైబర్ తక్కువగా తీసుకోవడం, కొన్నిరకాల మందులు, శారీరకంగా చురుకుగా లేకపోవడం, ముఖ్యంగా VUR (వెసికో యూరెటరిక్ రిఫ్లక్స్) వంటి పుట్టుకతో వచ్చే సమస్యలు మలబద్ధకాన్ని పెంచుతాయి. దీనివల్ల మూత్రనాళ సంక్రమణలను (UTIs) మూడు రెట్లు పెరుగుతాయి. దీర్ఘకాలంలో మూత్రపిండాల నష్టాన్ని మరింత పెంచుతుంది. అందుకే అధ్యయనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటున్నారు.
ఈ అధ్యయనం ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. ఇది కేవలం పెద్దలపై మాత్రమే జరిగింది. మూత్రపిండాల నష్టాన్ని తగ్గించింది కానీ పూర్తిగా మానేలా చేయలేదు. ఏ పేగు బ్యాక్టీరియా ముఖ్య పాత్ర పోషిస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రతి రోగికి ఒకేలాంటి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కాబట్టి పిల్లలపై అధ్యయనాలు సహా పెద్ద స్థాయి ట్రయల్స్ అవసరమని నిపుణులు అంటున్నారు.
చివరగా…
సాధారణంగా మలబద్ధకం మందుగా భావించే లుబిప్రోస్టోన్, భవిష్యత్తులో మూత్రపిండాల రక్షణకు ఒక కీలక సాధనంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో మలబద్ధకాన్ని చిన్న అసౌకర్యంగా కాకుండా.. మూత్రపిండాల నష్టానికి ప్రమాద కారకంగా చూడాల్సిన అవసరం ఉందని డాక్టర్ ఆనంద్ హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.