Colorectal Cancer in Men Under 50 : పేగులకు వచ్చే క్యాన్సర్ పెద్ద వయసు వారికే ఎక్కువగా వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం 50 ఏళ్లలోపు వారిలోనూ కొలొరెక్టల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇది పెద్దపేగు, పురీషనాళం భాగాలకు వచ్చే క్యాన్సర్. అందుకే 30, 40 ఏళ్ల వయసులో ఉన్న పురుషులు మల విసర్జన అలవాట్లలో వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మలంలో రక్తం కనిపించడం, తరచుగా మలబద్ధకం, విరేచనాలు, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి అంటున్నారు.
కొలొరెక్టల్ క్యాన్సర్ వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది కేవలం వృద్ధులకే పరిమితమైన వ్యాధి కాదని డాక్టర్ కె. శ్రీకాంత్ తెలిపారు. హైదారాబాద్లోని యశోదా ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా చేస్తోన్న డాక్టర్ కె. శ్రీకాంత్.. 50 ఏళ్లలోపు పురుషులే కాకుండా.. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు కూడా దీని గురించి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. మరి ఎలాంటి లక్షణాలు కొలొరెక్టల్ క్యాన్సర్‌కు హెచ్చరికలు కావచ్చు? ఎప్పుడు పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : ఇన్ఫెక్షన్లతో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
50 ఏళ్లలోపు పురుషుల్లోనూ కొలొరెక్టల్ క్యాన్సర్
పెద్దపేగు, పురీషనాళంలో క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు మల విసర్జన అలవాట్లలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. అయితే ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు కాదు. ఇతర జీర్ణకోశ సమస్యలు కూడా ఇలాంటి లక్షణాలకు కారణం కావచ్చు. అయినప్పటికీ లక్షణాలు కొనసాగితే వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. మరి మల విసర్జనలో ఏ మార్పులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మలంలో రక్తం
మల విసర్జన సమయంలో లేదా ఆ తర్వాత రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కొందరిలో టాయిలెట్ పేపర్‌పై, మరికొందరిలో టాయిలెట్ బౌల్‌లో రక్తం కనిపించవచ్చు. కొన్నిసార్లు మలంతో పాటు రక్తం కలిసిపోయి రావచ్చు. సాధారణంగా పైల్స్, అనల్ ఫిషర్స్ వల్ల కూడా రక్తస్రావం జరుగుతుంది. అయితే ప్రతిసారీ పైల్స్ వల్లే రక్తం వస్తుందని అనుకోకూడదు. రక్తస్రావం మళ్లీ మళ్లీ కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
Also Read : 30, 40 ఏళ్లకే పెద్దపేగు క్యాన్సర్, కారణాలు ఇవే.. ఈ లక్షణాలను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు
కుటుంబంలో కొలొరెక్టల్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, పెద్దపేగులో పాలిప్స్ ఉన్నవారు, లించ్ సిండ్రోమ్ లేదా ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి రక్త పరీక్షలు, మల పరీక్షలు, కొలొనోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స మరింత సమర్థవంతంగా అందించే అవకాశం ఉంటుంది.
మలబద్ధకం లేదా విరేచనాలు
తరచుగా మలబద్ధకం రావడం లేదా విరేచనాలు అవుతుండటం గమనిస్తున్నారా? కొందరిలో ఈ రెండు సమస్యలు మారుతూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు, ఇన్ఫెక్షన్లు వంటి కారణాలతోనూ ఇలాంటి మార్పులు రావచ్చు. కానీ ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా ఈ సమస్యలు కొనసాగుతున్నా, తరచుగా తిరిగి వస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు.
Also Read : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్
మలం ఆకారంలో మార్పులు
మల విసర్జన సమయంలో మలం గతంలో కంటే చాలా సన్నగా, రిబ్బన్ ఆకారంలో రావడం గమనిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే మల విసర్జన పూర్తయినప్పటికీ ఇంకా మలం మిగిలి ఉన్నట్లు అనిపించడం జరుగుతుంది. ఇవి జీర్ణవ్యవస్థలోని దిగువ భాగంలో మార్పులకు సంకేతాలు కావచ్చు.
కడుపునొప్పి, ఉబ్బరం
కడుపులో పదేపదే నొప్పి రావడం, తిమ్మిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతున్నాయా? ముఖ్యంగా మల విసర్జనలో మార్పులతో పాటు ఈ సమస్యలు కూడా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కొందరిలో కడుపు ఉబ్బినట్లు అనిపించడం, పొట్ట పరిమాణం పెరిగినట్లు కనిపించడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. ఇవి నిరంతరం ఉంటే టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
రక్తహీనత, అలసట
పెద్దపేగులో కొన్నిసార్లు నెమ్మదిగా రక్తస్రావం జరుగుతుంది. ఈ విషయం బయటకు కనిపించకపోవచ్చు. కానీ క్రమంగా శరీరంలో ఐరన్ నిల్వలు తగ్గి రక్తహీనత ఏర్పడవచ్చు. దీనివల్ల నీరసం, అలసట, చిన్న పని చేసినా ఆయాసం రావడం, శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఎలాంటి కారణం లేకుండా రక్తహీనత వస్తే దాని వెనుక కారణాన్ని గుర్తించడం ముఖ్యం.
Also Read : ఆన్‌లైన్‌లో మెడిసన్స్, రోగాల గురించి తెలుసుకుంటున్నారా? అలసట కూడా క్యాన్సర్ అనేస్తాది జాగ్రత్త
బరువు తగ్గడం
ఆహారపు అలవాట్లలో మార్పులు చేయకపోయినా, వ్యాయామం పెంచకపోయినా అకస్మాత్తుగా బరువు తగ్గుతున్నారా? ముఖ్యంగా మల విసర్జనలో మార్పులు, కడుపునొప్పి వంటి సమస్యలతో పాటు బరువు తగ్గడం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. క్యాన్సర్ సహా కొన్ని ఆరోగ్య సమస్యల్లో కారణం లేకుండా బరువు తగ్గడం ఒక హెచ్చరిక లక్షణంగా ఉండవచ్చు.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?
50 ఏళ్లలోపు పురుషులు కూడా లక్షణాలు తీవ్రమయ్యే వరకు వేచి చూడకూడదు. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉన్నా, పెద్దపేగులో పాలిప్స్ ఉన్నా.. లించ్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు ఉన్నా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఉన్నవారిలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. లక్షణాలను బట్టి వైద్యులు రక్త పరీక్షలు, మల పరీక్షలు, కొలొనోస్కోపీ వంటి టెస్ట్‌లు చేస్తామని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.
కొలొనోస్కోపీ ఎందుకు చేస్తారు?
కొలొనోస్కోపీ అనేది పెద్దపేగు, పురీషనాళం లోపలి భాగాలను పరిశీలించే పరీక్ష. ఇందులో కెమెరా అమర్చిన సన్నని, వంగే గొట్టాన్ని పురీషనాళం ద్వారా లోపలికి పంపించి పేగుల పరిస్థితిని పరిశీలిస్తారు. ఈ పరీక్ష ద్వారా పేగుల్లో అసాధారణ పెరుగుదలలు, పాలిప్స్, క్యాన్సర్‌కు సంబంధించిన మార్పులను గుర్తించవచ్చు. అవసరమైతే క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్న కొన్ని పాలిప్స్‌ను అదే సమయంలో తొలగించవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
Also Read : క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.. ఆ తప్పులు చేయకండి
