Telangana Recipes : తెలంగాణ వంటలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే మీరు కూడా వాటిని ట్రై చేయాలనుకుంటే కొబ్బరి వడలను ట్రై చేయవచ్చు. వీటినే కొబ్బరి గారెలు, కొబ్బరి చెక్కలు అని కూడా అంటారు. దీనిని ఛాయ్‌కి బెస్ట్ కాంబినేషన్‌గా చెప్తారు. ఉదయమైనా.. సాయంత్రమైనా స్నాక్‌గా చేసుకోగలిగే రెసిపీలలో ఇదీ కూడా ఒకటి. పైగా దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అయితే వీటిని ఇతర ప్రాంతాలలో కూడా చేస్తారు కానీ.. తెలంగాణలో చేసే దీని రెసిపీ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అంతేకాకుండా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
అల్లం - అంగుళం
జీలకర్ర - 1 స్పూన్
పచ్చిమిర్చి - 4
ఉప్పు - రుచికి తగినంత
వేడి నీరు - అవసరానికి తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడనంత
తయారీ విధానం
ముందుగా అల్లం పై తొక్కను తీసి.. పచ్చిమిర్చి, అల్లాన్ని కడిగి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. వాటిలో జీలకర్ర కూడా వేసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో నీరు వేసి మరిగించండి. స్టౌవ్ ఆపేసి.. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో బియ్యం పిండి, తురిమిన కొబ్బరి, ముందుగా తయారు చేసుకున్న అల్లం ముద్దను వేసి బాగా కలపాలి. దానిలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అనంతరం దానిలో వేడి నీళ్లు కొంచెం కొంచెంగా వేస్తూ.. చెంచాతో మిక్స్ చేయాలి. వేడి తగ్గాక.. పూరీ పిండిలా బిగుతుగా చేతితో ఒత్తుకోవాలి.
ఇప్పుడు ఓ పాలిథిన్ షీట్ లేదా బటర్ షీట్ తీసుకోండి. పాలిథిన్ షీట్ తీసుకుంటే దానిలో కాస్త నూనె అప్లై చేయండి. స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేయండి. అది కాగిన తర్వాత.. చేతులకు కాస్త నీటిని అప్లై చేసి పాలిథిన్ కవర్‌పై పిండిని పెట్టి దానిని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న వడలను నూనెలో వేయాలి. మిగిలిన పిండితో కూడా ఇదే మాదిరిగా వడలు ఒత్తుకుని.. నూనెలో వేయాలి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు కూడా తిప్పి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పూర్తిగా వేగిన తర్వాత వాటిని టిష్యూలపై వేసుకోవాలి. వీటిని ఛాయ్‌తో తింటే చాలా బాగుంటుంది.
ఈ కొబ్బరి వడలు రెండు మూడు రోజుల వరకు తాజాగా ఉంటాయి. పైగా ఇవి ఏమాత్రం గట్టిగా ఉండవు. పైన క్రంచీగా, లోపల మృదువుగా ఉంటాయి. అయితే ఇవి ఎక్కువ నూనె పీల్చుకుంటాయి అనుకునేవారు కచ్చితంగా ఓ టిప్‌ని ఫాలో అవ్వాలి. పిండి కాస్త గట్టిగా ఉంటే నూనె ఎక్కువ పీల్చుకోదు. వడలు తక్కువ నూనెను గ్రహిస్తాయి. కానీ పిండి ఎక్కువ లూజ్‌గా ఉంటే అవి ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. కాబట్టి పిండిని కలిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఛాయ్ పార్టనర్‌ని తయారు చేసి.. హాయిగా లాగించేయండి.
Also Read : ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది