Temple Style Pulihora : సౌత్ ఇండియాలో పులిహోర లేని ఫంక్షన్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. పూజల నుంచి ఫంక్షన్లవరకు దాదాపు అందరూ దీనిని చేసుకుంటారు. ఇవేమి లేకపోయినా.. ఇంట్లోనే రెగ్యూలర్‌గా పులిహోర చేసి.. దాని రుచిని ఆస్వాదించేవారు చాలామందే ఉంటారు. దాని రుచి అలాంటిది మరి. టేస్ట్, స్మెల్, రంగు ఇలా ప్రతి విషయంలోనూ పులిహోరకి పోటి లేదని చెప్పవచ్చు. అయితే మనం ఎంత బాగా పులిహోర చేసినా.. ఎక్కడో కొంచెం వెలితి ఉంటుంది. అబ్బా టెంపుల్‌కి వెళ్లినప్పుడు ఇచ్చిన పులిహోర మాదిరి లేదు కానీ బాగుంది అనుకుంటాం. చాలామందిలో ఇదే భావన ఉంటుంది.
టెంపుల్స్‌లో ప్రసాదంగా ఇచ్చే పులిహోరలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అబ్బా అది మనం చేసుకునేప్పుడు రావట్లేదే అనుకుంటారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్‌తో ఇంట్లోనే టెంపుల్ స్టైల్ పులిహోర చేసుకోవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలాంటి టిప్స్ ఫాలో అయితే దీని రుచి హైలైట్ అవుతుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 250 గ్రాములు
నూనె - పావు కప్పు
కరివేపాకు - 2 రెమ్మలు
పచ్చిమిర్చి - 3
పసుపు - 1 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
చింతపండు - 50 గ్రాములు
మసాలా కోసం..
నూనె - 2 స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మెంతులు - 1 టీస్పూన్
కరివేపాకు -1 రెబ్బ
ఇంగువ - అర టీస్పూన్
తాళింపు కోసం..
నూనె - పావు కప్పు
ఆవాలు - అర టీస్పూన్
పల్లీలు - పావు కప్పు
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి - 5
కరివేపాకు - 1 రెబ్బ
ఆవాల మసాల కోసం
ఆవాలు - రెండు స్పూన్లు
ఎండు మిర్చి - 1
అల్లం - అంగుళం
ఉప్పు - రుచికితగినంత
తయారీ విధానం
ముందుగా చింతపండును వేడి నీటిలో నానబెట్టాలి. దానినుంచి చింతపండు గుజ్జుని తీసి పక్కనపెట్టుకోవాలి. ఆవాల మసాలా కోసం ఆవాలు, ఎండుమిర్చి, అల్లం, కొద్దిగా ఉప్పును పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు ఘాటుగా ఉంటాయి అనుకుంటారు కొందరు. కానీ అల్లం కూడా వేస్తే దాని ఘాటు తగ్గుతుంది. లేదంటే అది చేదు రుచిని ఇస్తుంది. ఇప్పుడు బియ్యాన్ని కడిగి.. ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లతో మూడు విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి. బియ్యాన్ని కడగాలి కానీ నానబెట్టకూడదు. ఇలా చేస్తే అన్నం విరిగిపోతుంది. అన్నం వేడిగా ఉన్నప్పుడు.. అంటే అన్నం పొగలు వస్తున్న సమయంలోనే పసుపు, నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
స్టౌవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి దానిలో రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అనంతరం దానిలో ఆవాలు, మెంతులు వేసి రోస్ట్ చేయండి. కరివేపాకు కూడా వేసి.. అనంతరం చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. మీకు నచ్చితే కాస్త తురిమిన బెల్లం కూడా వేసుకుని తాలింపుని ఉడికించుకోవాలి. పసుపు, చింతపండు నాణ్యమైనవి ఎంచుకుంటే కచ్చితంగా మీకు ఆలయంలో తయారు చేసే పులిహోర రుచి వస్తుంది. చింతపండు ఉడికిన తర్వాత దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవాల ముద్ద వేసి ఉడికించాలి. అనంతరం స్టౌవ్ ఆపేయాలి.
ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న అన్నంలో ఈ తాలింపు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. పులిహోర రుచి అంతా దానిని మిక్స్ చేసుకోవడంలోనే దాగి ఉంటుంది. ఇప్పుడు మరోసారి స్టౌవ్ వెలిగించి దానిలో పావు కప్పు నూనె వేసి దానిలో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. నూనె ఎక్కువ వేసుకోకపోతే.. పులిహోర నోటికి అంటుకుని అంత రుచించదు. నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనెలు పులహోర రుచిని బాగా పెంచుతాయి. అనంతరం పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి.. వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముందుగా చింతపండు గుజ్జుతో రెడీ చేసుకున్న అన్నంలో వేసి మిక్స్ చేయాలి. టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ.
Also Read : బరువును తగ్గించే హెల్తీ సూప్.. డిన్నర్‌కి పర్ఫెక్ట్ రెసిపీ