Ragi Soup for Weight Loss : రాగిపిండి అనగానే మనకి గుర్తొచ్చేది సంగటి, జావా. చాలామంది వీటిని ఇష్టంగా తీసుకుంటారు. మరికొందరు ఆరోగ్య ప్రయోజనాల కోసం వీటిని ఎక్కువగా తమ డైట్లో చేర్చుకుంటారు. ముఖ్యంగా సమ్మర్లో వేడిని తగ్గించుకోవడం కోసం రాగిపిండిని వివిధ వంటకాల రూపంలో తీసుకుంటారు. ఇది చలువ చేస్తుందని.. వివిధ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని అంటారు. మీరు కూడా రాగిని మీ డైట్లో చేర్చుకోవాలనుకుంటే.. డిన్నర్‌కోసం రాగితో తయారు చేసిన సూప్‌ని మీరు ట్రై చేయవచ్చు.
మీరు బరువుతగ్గాలనే ప్లాన్‌తో ఉంటే రాగి సూప్ మీకు మంచి డిన్నర్ అవుతుంది. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కేవలం హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా టేస్ట్‌లో కూడా మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. మరి ఈ హెల్తీ డిన్నర్ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
రాగిపిండి - 1 కప్పు
ఉల్లిపాయ -1
క్యారెట్లు - 2
పాలకూర - అరకప్పు
బీన్స్ - అరకప్పు
క్యాబేజీ - అరకప్పు
స్వీట్ కార్న్- అరకప్పు
అల్లం - అంగుళం
వెల్లుల్లి - 2 రెబ్బలు
నీళ్లు - 4 కప్పులు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్స్
నెయ్యి - సూప్‌కి తగినంత
ఉప్పు - రుచికి తగినంత
మిరియాలు - చిటికెడు పొడి
కొత్తిమీర - గార్నిష్ కోసం
తయారీ విధానం
ముందుగా కూరగాయలను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి, అల్లం కూడా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై ఓ పెద్ద గిన్నె పెట్టండి. దానిలో నెయ్యి వేసి వేడి చేయండి. ఇప్పుడు దానిలో అల్లం, వెల్లుల్లి తురుము వేసి వేయించండి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు వేయండి. అవి వేగిన తర్వాత.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబెజీ, బీన్స్, స్వీట్ కార్న్ వేసి మూతపెట్టండి.
కూరగాయలు ఉడికిన తర్వాత దానిలో నాలుగు కప్పుల నీరు వేసి బాగా కలపండి. అనంతరం దానిలో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపండి. ఇప్పుడు అవి మరిగేవరకు స్టౌవ్‌ను మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని దానిలో రాగిపిండిని, నీటిని వేసుకుని బాగా కలపాలి. ఉండలు లేకుండా కలిపిన మిశ్రమాన్ని పక్కనపెట్టుకోండి. కూరగాయలు ఉడికి.. బాగా బాయిల్ అవుతున్న సమయంలో కలిపి పెట్టుకున్న రాగిపిండిని వేయాలి. ఇది వేస్తున్నంత సేపు గరిటెతో తిప్పుతూనే ఉండాలి. అప్పుడే అది ఉండలు లేకుండా మంచిగా సిద్ధమవుతుంది.
ఇప్పుడు రాగిపిండి ఉడికేవరకు మంటను చిన్నగా చేసి ఉడికించాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి దానిలో నిమ్మరసం వేసి బాగాకలపండి. చివరిగా కొత్తమీరతో ఈ సూప్న గార్నిష్ చేయవచ్చు. దీనిని రాత్రి సమయంలో మీ డిన్నర్గా తీసుకోవచ్చు. ఉదయాన్నే తీసుకున్నా కూడా మంచిదే. అంతేకాకుండా ఈ ఒక్కసూప్తో ఎన్నో హెల్ప్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి. బరువు తగ్గడంలో ఈ సూప్ బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీనిలోని వెజిటేబుల్స్ మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని తయారు చేసుకుని హాయిగా లాగించేయండి.
Also Read : ఆ సమస్యలున్నవారు కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు.. జుట్టుకైతే బోలేడు బెనిఫిట్స్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.