Curry Leaves Benefits : భారతీయులు వంటలలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో కరివేపాకు ఒకటి. ఇది డిష్‌కి మంచి టేస్ట్‌ని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఇది ఆరోగ్య ప్రయోజనాల కన్నా.. జుట్టు ప్రయోజనాలకే ఎక్కువ ఫేమస్ అయింది. అయితే దీనిని కేవలం హెయిర్ గ్రోత్ కోసం కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా రెగ్యూలర్‌గా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. దీనిలోని ఔషద గుణాలను గుర్తించి ఎన్నో శతాబ్ధాలుగా వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల శరీరానికి, హెయిర్‌కి ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడంలో..
హెల్తీ లైఫ్ కోసం బరువు తగ్గాలనేది ప్రతి ఒక్కరికీ ఉండే ముఖ్యమైన అజెండా అయిపోయింది. మీరు కూడా ఆ లిస్ట్‌లో ఒకరు అయితే కరివేపాకు మీ డైట్లో రెగ్యూలర్‌గా తీసుకోండి. ఎందుకంటే ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపి.. కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తాయి. దీనివల్ల మీరు బరువు వేగంగా తగ్గుతారు.
ఫ్రీరాడికల్స్
శరీరంలోని ఫ్రీ రాడికల్స్ అనేక ఆరోగ్య సమస్యలను తీసుకువస్తాయి. అయితే కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరార్ని రక్షిస్తాయి. అంతేకాకుండా కణాలను దెబ్బతినకుండా అడ్డుకుని హెల్తీగా ఉండడంలో సహాయం చేస్తాయి.
కొలెస్ట్రాల్ విషయంలో
కొలెస్ట్రాల్ అనేది గుండె సమస్యలు పెంచుతుందని అందరికీ తెలుసు. కాబట్టి దానిని వీలైనంత తొందరగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండే సమస్యలు రాకుండా కాపాడుతాయి.
మధుమేహమున్నవారికి..
మధుమేహమున్నవారు రోజు కరివేపాకు తీసుకుంటే చాలామంచిది. దీనిని రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా ఈ కణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
జీర్ణ సమస్యలుంటే..
ఈ కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే ప్రతి రోజూ మీ అన్నం మొదటి ముద్దను కరివేపాకు పొడితో తినండి. ఇలా రెగ్యూలర్‌గా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇది మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. కడుపు నొప్పి, గ్యాస్, డయేరియా వంటి సమస్యలను దూరం చేసి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో..
చాలామందికి ప్రెగ్నెన్సీ సమయంలో వికారంగా ఉంటుంది. ఆ సమయంలో కరివేపాకు వికారం లక్షణాలు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మార్నింగ్ సిక్నెస్ ఉన్నవారు కూడా దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే మంచిది.
ఒత్తిడికై..
ఒత్తిడి పెరిగిపోవడానికి ఒక్క రీజన్ అంటూ లేదు. మన జీవనశైలి నుంచి.. తినే తిండి.. జాబ్‌లు.. ఫ్యామిలీ.. డబ్బులు ఇలా ప్రతి అంశం మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. మీరు దానిని నుంచి ఉపశమనం కావాలనుకుంటే.. కరివేపాకుల వాసన మీకు కాస్త రిలీఫ్‌ని ఇవ్వవచ్చు. ఇది మెదడును శాంత పరిచి.. ఒత్తిడిను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గాయాలు త్వరగా నయం అయిపోతాయి. ఇన్ఫెక్షన్లు కూడా వ్యాప్తి చెందకుండా కరివేపాకు హెల్ప్ చేస్తుంది. దగ్గు, జలుబు వంటి లక్షణాలనుంచి త్వరితగతిన ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా దీనిలోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జుట్టుకు కలిగే ప్రయోజనాలివే..
కరివేపాకు జుట్టుకు ఓ వరమనే చెప్పాలి. ఇది జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా మాయిశ్చరైజింగ్‌ను అందిస్తుంది. డ్యామేజ్ అవుతున్న హెయిర్‌కి పోషణ అందించి.. హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ అవుతుంది. జుట్టు మెరవడాన్ని కూడా తగ్గించి.. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టు చివర్ల చిట్లిపోవడం.. జుట్టు పల్చబడడాన్ని తగ్గించి.. జుట్టు ఒత్తుగా పెరగడంలో కరివేపాకు పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. అందుకే కరివేపాకును కచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా కరివేపాకుని మీ రెగ్యూలర్ డైట్లో చేర్చుకుని హెల్త్, హెయిర్ బెనిఫిట్స్ పొందేయండి.
Also Read : ఈ పనులు రోజూ చేస్తున్నారా? అయితే మీ కిడ్నీలు హాంఫట్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.