World Kidney Day : మూత్రపిండాలు మొత్తం మీ శరీర వ్యవస్థను ప్రభావితం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి రక్తం నుంచి టాక్సిన్స్, అదనపు నీటిని తొలగిస్తాయి. ఈ ప్రక్రియలో ఏ పొరపాటు జరిగినా.. ఆరోగ్యంలో పెనుమార్పులు వస్తాయి. రక్తపోటును నియంత్రించడానికి, ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండడంలో కూడా కిడ్నీలు హెల్ప్ చేస్తాయి. సోడియం, పొటాషియంతో సహా అనేక ఖనిజాలు, అణువులు కలిసి రక్త ప్రవాహ స్థాయిలను నియంత్రించేలా చేస్తాయి. అయోడిన్, నీటిని కంట్రోల్ చేసి.. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. 


అందుకే మూత్రపిండాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఏటా మార్చిలో రెండవ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలకు వీటిపై అవగాహన కల్పించి.. ఆరోగ్యాన్ని కాపాడేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తాయి. మీకు తెలుసా రోజూవారీ మనం చేసే కొన్ని పనులు కిడ్నీలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. ఇంతకీ ఆ పనులు ఏంటో.. వాటిని కంట్రోల్ చేసి కిడ్నీలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


హైడ్రేటెడ్​గా ఉండాలి


హైడ్రేటెడ్​గా లేకపోతే మీ కిడ్నీలు ప్రమాదంలో పడ్డట్టే. ముఖ్యంగా ఈ సమస్య సమ్మర్​లో ఎక్కువ ఎదురవుతుంది. కాబట్టి శరీరానికి వీలైనంత లిక్విడ్స్​ను అందించాలి. నీరు శరీరం నుంచి సోడియం, టాక్సిన్స్​ను బయటకు పంపడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు 3 లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి అంటున్నారు వైద్యులు. 


పెయిన్ కిల్లర్స్


కొందరు పెయిన్ కిల్లర్స్​ను బఠాణీలులా వేసేసుకుంటారు. చిన్న నొప్పి వచ్చినా.. పెయిన్ కిల్లర్​ను ఆశ్రయిస్తారు. తలనొప్పి, కీళ్లు నొప్పులకు డాక్టర్ సలహా లేకుండానే పెయిన్ కిల్లర్స్​ను తీసుకునే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ మందులు రెగ్యూలర్​గా తీసుకుంటే.. అవి మీ మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. 


ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. 


ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు. ఇది రక్తపోటును ప్రభావితం చేస్తుంది. ఇది నేరుగా మూత్రపిండాలను ఎఫెక్ట్ చేస్తుంది. కొందరు టేస్ట్ కోసమని చెప్పి ఉప్పును ఎక్కువ వేసేసుకుంటారు. అలాంటి వారు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి. 


షుగర్ తినడం


చక్కెర ఎక్కువ కలిగిన పదార్థాలు, తీపిగా ఉండే పదార్థాలను కంట్రోల్ చేయాలి. ఇవే కాకుండా కుకీలు, తృణధాన్యాలు వంటివి మధుమేహంతో పాటు ఊబకాయంను పెంచుతాయి. ఇవి మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. 


ఆ ఫుడ్​ వద్దు


ప్రాసెస్ చేసిన ఫుడ్ మొత్తం ఆరోగ్యానికే కాదు.. కిడ్నీలను కూడా బాగా ప్రభావితం చేస్తుంది. సోడియం భాస్వరంతో నిండిన ఫుడ్స్ కిడ్నీలపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ రకమైన ఫుడ్ తీవ్రమైన పరిణామాలకు దారితీసేలా చేస్తుంది. కిడ్నీ సమస్యలు లేకపోయినా.. వాటిని రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలు, బ్లడ్ షుగర్ వంటి సమస్యలు వస్తాయి. 


నిద్ర లేకుంటే..


కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. సరైన నిద్ర ఉండాలంటున్నారు. సరైన నిద్ర లేకుండా నిద్ర సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల కిడ్నీలపై పనిభారం పెరుగుతుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. మూత్రపిండాలకు మంచి జరగాలంటే రాత్రి నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. 


స్మోకింగ్ & డ్రింకింగ్ 


గుండె, ఊపిరితిత్తులకే కాదు.. ధూమపానం, మధ్యపానం వల్ల కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ధూమపానం వల్ల మూత్రంలో నుంచి ప్రోటీన్ బయటకి వెళ్లిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి స్మోకింగ్ అలవాటును తగ్గించుకుంటే మంచిది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల త్వరగా డీహైడ్రేట్ అయిపోతారు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కిడ్నీ సమస్యలను పెంచుతాయి. 


ఇవే కాకుండా మాంసం ఎక్కువ తినడం, వ్యాయామం చేయకపోవడం వంటివి కూడా కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ రెగ్యూలర్ యాక్టివిటీలను కంట్రోల్ చేసి.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. 


Also Read : స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.