Penamaluru Politics: ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను క్రమంగా ప్రకటిస్తున్న కొద్దీ అసమ్మతులు కూడా పెరుగుతున్నాయి. తమ నియోజకవర్గంలో తమకే టికెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న నేతలు.. తమ పేరు పరిగణనలోకి తీసుకోకపోయేసరికి అవాక్కవుతున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు లేదని తెలియడంతో.. ఆయన వర్గీయులు ఆందోళన చేపట్టారు. బోడె ప్రసాద్ ఇంటికి భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకొని టీడీపీ అధిష్ఠానం ఆయనకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకొనేందుకు యత్నించారు. మరికొంత మంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేశారు. జై బోడె.. జై జై బోడె.. పెనమలూరు గడ్డ.. బోడె ప్రసాద్ అడ్డా.. అంటూ నినాదాలు చేశారు. పెనమలూరు టికెట్ బోడె ప్రసాద్ కు ఇవ్వడం లేదని పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. 


ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు టికెట్ లేదని చెప్పడం తన గుండె కలచివేసిందని వాపోయారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని గుర్తు చేసుకున్నారు. తాను పార్టీ మారబోనని అన్నారు. కార్యకర్తల పక్షాన నిలబడతానని, అవసరమైతే ఎలాగైనా తనను తాను గెలిపించుకొని చంద్రబాబుకు బహుమానంగా ఇస్తానని అన్నారు. 


బోడె ప్రసాద్ వైపే కార్యకర్తల మొగ్గు
పెనమలూరులో నెలకొన్ని ఈ టికెట్ పంచాయితీ గతంలో వర్గ విభేదాలకు దారి తీసింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఇంచార్జిగా తొలి నుంచి బోడే ప్రసాద్ మాత్రమే ఉన్నారు. టీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా బోడె ప్రసాద్.. పార్టీ మారకుండా తన నియోజకవర్గంలో సేవలు కొనసాగించారు. అయితే వైసీపీ నుంచి కొద్ది నెలల క్రితం బయటకు వచ్చి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైపు ఇప్పుడు టీడీపీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 


దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బోడె ప్రసాద్ సీటుకు గండం ఉందని తొలి నుంచి అంచనాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెనమలూరు నుంచి తానే పోటీ చేస్తానని బోడె ప్రసాద్ చెబుతూ వస్తున్నారు. ఈ విషయంపైనే నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై ఆయన ఇదే విషయాన్ని చాలా చోట్ల తేల్చి చెప్పారు. పెనమలూరు సీటు, అక్కడ గెలుపు రెండూ తమదేనని తేల్చి చెప్పారు. టీడీపీ కార్యకర్తలు కూడా బోడే ప్రసాద్‌కే జై కొడుతుండగా.. కొలుసు పార్థసారథిని వ్యతిరేకిస్తున్నారు.