Paritala Sriram vs Gonuguntla Suryanarayana: ధర్మవరంలో టికెట్ కోసం బీజేపీ, టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్, బీజేపీ (BJP) నుంచి  వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ ధర్మవరం టికెట్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్నటివరకూ బీజేపీతో పొత్తు లేకపోవడంతో ఆ టికెట్ పరిటాల శ్రీరామ్ దేనని పార్టీ కార్యకర్తలు సైతం భావించారు. వారం రోజుల కిందట టీడీపీ (TDP), బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో ధర్మవరం, పిఠాపురం లాంటి కొన్ని చోట్ల సీట్ వార్ మొదలైంది. 


ధర్మవరం టికెట్ ఎవరికి దక్కేనో! 
ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ (Gonuguntla Suryanarayana)కు టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. తమకు కాకుండా గతంలో పార్టీని వీడి బీజేపీలో ఉన్న వరదాపురం సూరికి టికెట్ ఎలా కేటాయిస్తారని పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో ధర్మవరం చేరుకుని కాలేజీ సర్కిల్ నుంచి గాంధీ విగ్రహం వరకు బల ప్రదర్శన చేశారు. 2014లో గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై 14,211 ఓట్ల మెజారిటీతో నెగ్గి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఈసారి గోనుగుంట్ల మీద కేతిరెడ్డి విజయం సాధించారు. 


పరిటాల శ్రీరామ్ కు ఇస్తే విజయం అని ధీమా!


ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్ కు ఇస్తే విజయం సాధిస్తామని చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సూరికి తాము సహకరించామని, ఆయనకు 2019 ఎన్నికల్లోనూ అండగా నిలిచామన్నారు. అయితే ఓటమి తరువాత బీజేపీలో చేరిన వరదాపురం సూరికి కాకుండా పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ కు పొత్తులో భాగంగా టికెట్ కేటాయిస్తే బాగుంటుందన్నారు. చంద్రబాబు ఆదేశించిన తర్వాతనే శ్రీరామ్ ధర్మవరం వచ్చారని గుర్తు చేశారు. అప్పటినుంచి నేటి వరకు కార్యకర్తలకు అండగా ఉంటూ ధర్మవరంలో పార్టీకి ఊపిరి పోసిన శ్రీరామ్ కు ఛాన్స్ ఇవ్వడమే న్యాయమన్నారు. వేరే చోట బీజేపీకి ఛాన్స్ ఇస్తే పర్వాలేదని, ధర్మవరంలో మాత్రం చంద్రబాబు ఆదేశానుసారం పనిచేసిన పరిటాల శ్రీరామ్‌కు పార్టీ అండగా నిలవాలన్నారు. 


ఒకవేళ నిజంగానే పొత్తు ధర్మం ప్రకారం టికెట్ బీజేపీకి ఇస్తామంటే తాము ఎదురుచెప్పేది లేదని, కానీ గోనుగుంట సూర్యనారాయణకు టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబును కోరారు. పార్టీని వీడిన వారికి కాకుండా, కార్యకర్తలకు స్థానికంగా అండగా ఉన్న పరిటాల శ్రీరామ్ బరిలోకి దింపి గెలిపిద్దాం అన్నారు. క్యాడర్‌కు, కార్యకర్తలకు నమ్మకం ఉండే వారి వైపు టీడీపీ అధిష్టానం మొగ్గుచూపాలన్నారు. ధర్మవరంలో జరిగిన భారీ నిరసనతో అన్ని మండలాల్లోను దీనిపై చర్చ జరుగుతోంది. అధికారంలోకి రావాలంటే క్యాడర్, కార్యకర్తలతో పాటు ప్రజా సమస్యలు తెలిసిన వారికి బరిలో నిలిపి గెలిపించుకుందాం అన్నారు.