వంటగది, పూజ గది, గృహాలంకరణ వస్తువుల్లో ఇత్తడి పాత్రలు ఉంటే ఆ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే పూర్వం అందరి ఇళ్ళలో ఇత్తడి బిందెలు, బుంగలు చక్కగా అల్మరా మీద పేర్చి పెట్టుకునేవారు. అవి చూడగానే కిచెన్  ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది. ఇత్తడి పాత్రలు ఉపయోగించడం ఆరోగ్యకరమైన అలవాటు. కానీ వాటిని భద్రపరిచే విషయానికి వస్తే మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది. అవి గాలికి త్వరగా నల్లగా మాసిపోయినట్టుగా కనిపిస్తాయి. వాటిని శుభ్రం చేసేందుకు కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ చిట్కాలు తెలుసుకున్నారంటే మాత్రం ఇత్తడి పాత్రలు సులువుగా క్లీన్ చేసుకోవచ్చు.


వేడి నీరు, వెనిగర్


కొన్ని నీటిని మరిగించి అందులో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ జోడించాలి. రెండు నిమిషాల పాటు వాటిని అలాగే ఉంచి కాటన్ వస్త్రం ఆ నీటిలో ముంచి దానితో పాత్రలు రుద్దాలి. గ్రీజు తొలగించిన తర్వాత సోప్, స్పాంజ్ ఉపయోగించి మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. అంతే వాటికి మునుపటి రూపు వచ్చేస్తుంది. మురికి లేకుండా మిలమిలా మెరిసిపోతాయి. మెత్తని వస్త్రం తీసుకుని తుడిచి ఆరబెట్టేస్తే సరిపోతుంది.


సున్నం, ఉప్పు


ఇత్తడి పాత్ర మీద కొద్దిగా సున్నం, ఉప్పు వేసి దాని మీద వెనిగర్ పోయాలి. వంట గది స్క్రబ్బర్ తీసుకుని సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుని ఆరబెట్టేస్తే సరిపోతుంది.


Also Read: భారీగా పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు- ఈ అలవాట్లే ప్రధాన కారణం


చింతపండు గుజ్జు


మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు పాటించే సింపుల్ చిట్కా ఇదే. రాగి, ఇత్తడి పాత్రలు శుభ్రం చేసేందుకు చింతపండు ఉపయోగిస్తారు. చింతపండు గుజ్జు తీసుకుని స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెచ్చని లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటితో పాత్రలు కడగాలి.


నిమ్మరసం, పిండి


పాత్రలపై కొద్దిగా పిండి, నిమ్మరసం చిలకరించి వాటిని బాగా స్క్రబ్ చేయాలి. అప్పుడు పాత్రల మీద పేరుకుపోయిన నలుపు మురికి అంతా పోతుంది. స్క్రబ్ చేసిన తర్వాత నీటితో కడిగి మెత్తని వస్త్రంతో తుడిచి ఆరబెట్టుకోవాలి.


డయాటోమాసియస్ ఎర్త్


ఇది మార్కెట్లో సులభంగా లభించే ఒకరకమైన పొడి. దీన్ని నీళ్ళలో కలిపి పేస్ట్ లా చేసుకుని పాత్రకి పట్టించాలి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత స్పాంజ్ లేదా ఏదైనా క్లాత్ తీసుకుని స్క్రబ్ చేయాలి. నీటితో శుభ్రంగా కడిగేస్తే మురికి అంతా తొలగిపోతుంది.


Also Read: రొమ్ము క్యాన్సర్ కనిపెట్టే మమోగ్రాఫ్, అల్ట్రా సౌండ్ పరీక్షల గురించి తెలుసా?


కెచప్


టొమాటో కెచప్ తినడానికి మాత్రమే కాదు మురికిపట్టిన ఇత్తడి పాత్రలు శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. టొమాటో కెచప్ తీసుకుని దాన్ని ఇత్తడి వస్తువుపై రుద్దాలి. ఆపై గది ఉష్ణోగ్రత ఉన్న నీటితో కడగాలి. అంతే మీ పాత్రలు తళతళా మెరిసిపోతాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.