Cancer Cases Rise: క్యాన్సర్ మహమ్మారి కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయని కొత్త అధ్యయనం వెల్లడిస్తోంది. బీఎంజీ అంకాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసుల సంఖ్య గత 30 ఏళ్లలో బాగా పెరిగినట్టు కనిపిస్తోంది. 2019 లో 3.26 మిలియన్ కేసులు నమోదయ్యాయి. 1990 కంటే ఇది 79 శాతం ఎక్కువ. క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణాలు ఏంటి అనేది పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.
ఆ అలవాట్లే కొంపముంచాయా?
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం 14 నుంచి 49 సంవత్సరాల వయసు కలిగిన వారిలో క్యాన్సర్ కేసులు పెరగడానికి అధిక బరువు, రెడీ మీట్ ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తినడం, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా జన్యుపరమైన అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కేసుల పెరుగుదల గురించి పూర్తి అవగాహన కోసం మరిన్ని పరిశోధనలు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలు
తాజా అధ్యయనం ప్రకారం ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఐరోపాలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అయితే ఖచ్చితమైన కారణాన్ని మాత్రం కనిపెట్టేందుకు మరింత పరిశోధనలు అవసరం. చర్మ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు సర్వసాధారణంగా మారాయి. ఈ డేటా ప్రకారం క్యాన్సర్ 50 ఏళ్ల లోపు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది మరణించారు. మరణాల రేటు 25 శాతానికి పైగా పెరిగింది. ఈ పరిశోధన మొత్తం జనాభాలో 40 శాతం మందిని పరిగణనలోకి తీసుకోలేదు. యూఎస్, చైనా, యూకే సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల బృందం ఈ నివేదికని సమర్ధించడం లేదు.
Also Read: రొమ్ము క్యాన్సర్ కనిపెట్టే మమోగ్రాఫ్, అల్ట్రా సౌండ్ పరీక్షల గురించి తెలుసా?
క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?
జీవనశైలి ఎంపికలు మార్చుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు ధూమపానం చేయకపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, చక్కగా వ్యాయామం చేయడం వంటివి చేస్తే మంచిది. శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. అనారోగ్యంగా అనిపించినా క్యాన్సర్ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడం చాలా ముఖ్యం రోగ నిర్ధారణ చేసుకుని సరైన సమయంలో చికిత్స తీసుకుంటే క్యాన్సర్ ని జయించవచ్చు.
పెరుగుతున్న మెడ క్యాన్సర్ కేసులు
అనేక క్యాన్సర్ రకాలలో మెడ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా అధికంగా వస్తున్న క్యాన్సర్లలో ఆరో స్థానంలో ఉంది. వీటిలో 57.5% కేసులు ఆసియాలోనే నమోదవుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోనే ఎక్కువగా మెడ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. మెడ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారకాలను వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పొగాకు వాడే వారిలో ఇది వచ్చే అవకాశం ఉంది. పొగాకు, ఆల్కహాల్ రెండింటినీ ఎక్కువగా ఉపయోగించేవారు మెడ క్యాన్సర్ ప్రమాదం బారిన పడే అవకాశం 35 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
Also Read: వెన్నునొప్పి వేధిస్తుందా? ఈ ఆహారాలతో చెక్ చెప్పేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.