Tutti Frutti Cake Recipe For Christmas : క్రిస్మస్ సమయంలో కేక్స్‌కి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ సమయంలో డెజర్ట్‌లలో కేక్ లేకుంటే ఆ సెలబ్రేషన్స్ అసంపూర్ణంగానే ఉంటాయి. అయితే ఆ కేక్‌ని ఇంట్లోనే తయారు చేసుకోగలిగితే.. దానికి మించిన పండుగ ఇంకోటి ఉంటుందా? ఒక్కసారి చేయడం అలవాటు అయితే చాలు పండుగలకు.. పుట్టినరోజులకు.. స్పెషల్ డేలలో దీనిని హాయిగా చేసుకుని లాగించేయవచ్చు. మరి అందరికీ నచ్చే.. ముఖ్యంగా పిల్లలు మెచ్చే టూటీ ఫ్రూటీ కేక్‌ను మీరు ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
కోకో పౌడర్ - 150 గ్రాములు
మైదా - 175 గ్రాములు (చల్లుకుని పక్కన పెట్టుకోవాలి)
బాదం పొడి - 150 గ్రామములు
బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర స్పూన్
చాక్లెట్ సిరప్ - 150 ml
బటర్ - 250 గ్రాములు
పంచదార - 150 గ్రాములు
గుడ్లు - 5
మిక్స్డ్ ఫ్రూట్ జామ్ - 25 గ్రాములు
టూటీ ఫ్రూటీ - 100 గ్రాములు
ఐసింగ్ షుగర్ - 2 టేబుల్ స్పూన్స్
టూటీ ఫ్రూటీ కేక్ తయారీ విధానం
మీరు టూటీ ఫ్రూటీ కేక్ తయారు చేయాలనుకున్నప్పుడు.. టూటీ ఫ్రూటీని చాక్లెట్ సిరప్‌లో ఒక వారం రోజుల ముందు నానబెట్టండి. బేకింగ్ చేసే రోజున మిక్సింగ్ గిన్నెలో మైదా పిండి, బాదం పొడి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. అవి బాగా కలిసేందుకు ఫోర్క్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ఓవెన్‌ను ప్రీహీట్ చేయండి.
మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో బటర్, షుగర్ వేసి బాగా కలపండి. క్రీమ్ ఆకృతిలో, లేత పసుపు రంగులోకి మారేవరకు దానిని బాగా కలుపుతూనే ఉండండి. లేత పసుపు రంగు క్రీమ్ మాదిరిగా వచ్చిన తర్వాత దానిలో ఎగ్స్ వేయండి. అది మరింత క్రీమిగా మారేవరకు దానిని బాగా కలపండి. మృదువైన క్రీమ్‌గా మారిన తర్వాత దానిలో చాక్లెట్ సిరప్, జామ్, నానబెట్టిన టూటీ ఫ్రూటీలు ఈ మిశ్రమంలో వేయాలి.
ఇప్పుడు పిండిని కూడా ఇదే మిశ్రమంలో వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా బాగా కలపుకోవాలి. లేదంటే కేక్ మధ్యలో గాలి ఉండిపోవడం, ముద్దులుగా కేక్ మారడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఉండలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేయాలి. మీకో విషయం తెలుసా? మీరు పిండిని ఎంత బాగా కలపగలిగితే మీ కేక్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం మీరు ఫోర్క్ యూజ్ చేయొచ్చు. లేదంటే బ్యాటర్ మిక్సింగ్ పరికరాలు ఉపయోగించవచ్చు.
కేక్ బ్యాటర్ బాగా మిక్స్ చేసిన తర్వాత.. బటర్పేపర్తో టిన్ రెడీ చేసి పెట్టుకోవాలి. దానిలో పిండిని వేయాలి. గాలి బుడగలు లేకుండా దానిని సున్నితంగా ట్యాప్ చేస్తూ.. టిన్‌లో సెట్ చేయాలి. ఒకసారి నేలను ట్యాప్ చేస్తే తెలియకుండా ఎక్కడైనా గ్యాప్ ఉన్నా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ టిన్ను 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో ఉంచాలి. దీనిని 35 నుంచి 40 నిముషాలు ఉడికించాలి. కేక్ కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి దానిలో టూత్ పిక్ గుచ్చాలి. అది క్లీన్‌గా బయటకు వస్తే కేక్ రెడీ అయినట్లే.
ఇలా రెడీ అయిన కేక్‌ను ఓవెన్ నుంచి బయటకు తీయాలి. దానిపై ఐసింగ్ షుగర్‌తో కోటింగ్ చేయాలి. గార్నిష్ చేసుకోవడానికి మీరు డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ సిరప్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిని ఫ్రిజ్‌లో పెట్టకుండా నార్మల్ టెంపరేచర్లో రెండు రోజులు ఉంచుకోవచ్చు. ఫ్రిజ్‌లో వారం రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా క్రిస్మస్కు టూటీ ఫ్రూటీ కేక్ చేయాలనుకుంటే ఈ రోజే టూటీ ఫ్రూటీలు నానబెట్టేయండి. క్రిస్మస్ రోజు హాయిగా కేక్ వండేసి.. లాగించేయండి.
Also Read : ఎగ్‌లెస్ రవ్వ కేక్.. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే రెసిపీ