Eggless Cake Recipe : ఇంట్లోనే పిల్లలకు నచ్చే కేక్​ను మీరు చాలా సింపుల్​గా తయారు చేసేయొచ్చు తెలిసా? వంటింట్లో ఉండే వాటితోనే ఈ కేక్​ను తయారు చేయొచ్చు. పైగా ఇది ఎగ్​లెస్​ కూడా. గోధమ పిండి, రవ్వ, పెరుగు వంటి వాటితో ఈ కేక్​ను తయారు చేస్తాము. ఒకవేళ మీరు బిగినర్​ బేకర్ అయినా సరే.. ఇది బేకింగ్​ చేయడంలో మిమ్మల్ని ఇబ్బందే పెట్టదు. అంతేకాకుండా దీనిని పర్ఫెక్ట్​గా కొలవాల్సిన అవసరం లేదు. మరీ ఈ సింపుల్ కేక్​ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


రవ్వ - 1 కప్పు (పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి)


గోధుమ పిండి - అరకప్పు


పంచదార - ముప్పావు కప్పు (గ్రైండ్ చేసుకోవాలి)


ఉప్పు - చిటికెడు


పెరుగు - 1 కప్పు


వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్


ఆలివ్ ఆయిల్ - ముప్పావు కప్పు


పాలు - అరకప్పు


బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్


బేకింగ్ సోడా - అర టీస్పూన్


పిస్తా - గార్నిష్ కోసం (కట్ చేసి పెట్టుకోవాలి)


పంచదార పాకం కోసం


నీరు - అరకప్పు


పంచదార - 2 టీస్పూన్స్ 


నిమ్మరసం - 2 టీస్పూన్స్


తయారీ విధానం


ముందుగా ఓవెన్​ను 180 డిగ్రీల సెల్సియస్​కు 10 నిమిషాలు ప్రీ హీట్ చేయండి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకునిదానిలో గోధుమ పిండి, రవ్వను వేసి జల్లెడ పట్టాలి. దానిలో పంచదార పొడి కూడా వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు, పెరుగు, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ముద్దలుగా లేకుండా కలిపిన తర్వాత.. దానిలో ఆలివ్ నూనె వేయాలి. ఇది మిశ్రమాన్ని మరింత క్రీమీగా చేస్తుంది. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా పాలు పోయాలి. ఇది మందపాటి పిండి అయ్యేలా బాగా కలపాలి. అనంతరం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలపి పక్కన పెట్టుకోవాలి.


ఇప్పుడు కేక్ టిన్​ తీసుకుని దానికి నెయ్యి రాయండి. దానిలో బటర్​ పేపర్ వేసినా కూడా నెయ్యి రాయడం మాత్రం మరచిపోకండి. ఇప్పుడు తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని దీనిలో వేయాలి. ఎలాంటి గ్యాప్స్ లేకుండా కేక్​ టిన్​ను మెల్లగా నేలప్ టాప్ చేయండి. ఇలా చేయడం వల్ల కేక్ సమానంగానూ.. మధ్యలో గ్యాప్స్​ లేకుండాను వస్తుంది. ఈ టిన్​ను బేకింగ్​ కోసం ఓవెన్ల్ ఉంచండి. 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 45 నిమిషాలు కేక్​ను బేక్ చేయండి.


ఇలా తయారు చేసుకున్న కేక్​ను ఓవెన్​ నుంచి తీసి.. గది ఉష్ణోగ్రతకు చల్లారనివ్వండి. ఇప్పుడు కేక్​ను డి-మోల్డ్ చేసి.. బటర్​ పేపర్​ తీసేయండి. సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకోండి. ఇప్పుడు చక్కెర సిరప్​ కోసం.. స్టవ్ వెలిగించి ఓ గిన్నె పెట్టి దానిలో నీరు, చక్కెర వేయండి. అది మరగడం ప్రారంభించే వరకు మీడియం మంట మీద వేడి చేయండి. తర్వాత నిమ్మరసం వేసి బాగా కలిపి స్టౌవ్ ఆపేయాలి.


ఇప్పుడు సర్వింగ్​ ప్లేట్​లో ఉన్న కేక్​పై ఈ చక్కెర సిరప్​ వేయాలి. కేక్​ ఈ సిరప్​ను పీల్చుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అనంతరం మీరు పిస్తాతో లేదా మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్​తో దీనిని గార్నిష్ చేసుకోవచ్చు. అంతే పిల్లలకు, పెద్దలకు నచ్చే టేస్టీటేస్టీ ఎగ్​లెస్ రవ్వ కేక్ రెడీ. చక్కగా ఇంటిల్లీ పాది దీనిని హాయిగా ఆస్వాదించవచ్చు. 


Also Read : చలికాలంలో పాలక్ వడలు.. క్రంచీగా, టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ