అంగారక గ్రహం, చంద్ర గ్రహం మీద మనుగడ సాగించడం సాధ్యమేనా అనే విషయం గురించి ప్రపంచంలో చాలా దేశాలు ప్రయోగాలు జరుపుతున్నాయి. చైనా ఈ మధ్య కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో ఒక ముందుడుగు వెయ్యడానికి సిద్ధపడుతోంది. కోతుల మనుగడ అంతరిక్షంలో ఎలా ఉంటుంది? వాటిలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం వంటివన్నీ అధ్యయనం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకు సంబంధించిన వివరాలు ఈ మధ్య వెలువరించారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
చైనా అంతరిక్షంలో కొత్త ప్రయోగాలు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కొత్తగా ఏర్పాటు చేసిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి కోతులను పంపాలని ప్రణాళికలు వేస్తోంది. అక్కడ జీరో గ్రావిటి వాతావరణంలో కోతులు ఎలా మనుగడ సాగిస్తాయి? పునరుత్పత్తి ఏవిధంగా ఉంటుంది వంటి విషయాల మీద పరిశోధనలు చెయ్యాలని యోచిస్తున్నట్టు సమాచారం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ లో ప్రచురితమైన సమాచారం ప్రకారం ఇదివరకు అంతరిక్ష పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జాంగ్ పర్యవేక్షణలో ఈ అతి పెద్ద మాడ్యూల్ నిర్వహించబోతున్నారట. ఈ మాడ్యూల్ ప్రధానంగా లైఫ్ సైన్సెస్ ప్రయోగాల కోసం ఉపయోగిస్తారు.
ముందుగా చేపలు, నత్తల వంటి చిన్నచిన్న జీవులను అధ్యయనానికి ఉపయోగించిన తర్వాత ఇప్పుడు ఎలుకలు, మాకాక్ (కోతులు)లతో అంతరిక్షంలో మనుగడ, పునరుత్పత్తి వంటి వాటిని పర్యవేక్షించడం కోసం ఈ ప్రయోగాలు నిర్వహిస్తారని జాంగ్ వివరించారు. ఈ ప్రయోగాలు మైక్రోగ్రావిటితోపాటు ఇతర అంతరిక్ష వాతావరణ పరిస్థితుల్లో జీవుల మనుగడను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయని అనుకుంటున్నారు.
ఎలుకల వంటి ప్రైమేట్స్ జీవులపై ఇటువంటి అధ్యయనాలు చెయ్యడంలో ఇంకా చాలా అడ్డంకులు అధిగమించాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సోవియట్ పరిశోధకులు 18 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణంలో ఎలుకలు శారీరకంగా ఎదురైన సవాళ్ళను అదిగమించి సంభోగించడాన్ని గమనించారు. కానీ వాటిలో ఒక్కటి కూడా గర్భం దాల్చిన దాఖలాలు లేవు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అవి పిల్లలను పుట్టించలేదు.
అంతరిక్షంలో లైఫ్ సైన్సెస్ కు చెందిన ప్రయోగాల విషయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వ్యోమగాములు వాటికి ఆహారం అందించాలి, వాటి వ్యర్థాలను మేనేజ్ చెయ్యల్సి ఉంటుందని సింగువా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ కెహ్కూయ్ కీ తెలిపారు. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వృషణాలతోపాటు మరికొన్ని రిప్రొడక్టివ్ అవయవాలు దెబ్బతింటాయని, ఈ ప్రయోగంలో భాగం పంచుకున్న జంతువుల్లో గణనీయంగా సెక్స్ హార్మోన్లు తగ్గడానికి కారణం అవుతుందని భూమి మీద జరిపిన కొన్ని ప్రయోగాలు రుజువు చేశాయి.
చంద్రుడు, అంగారక గ్రహాల మీద మనుగడ గురించి ప్రపంచంలో చాలా దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఈ తరుణంలో మనుషులతో సారూప్యం కలిగిన కోతుల వంటి పెద్ద జంతువుల ప్రవర్తన అంతరిక్షంలో ఎలా ఉంటుందో నిర్ధారించే ఈ ప్రయోగాలు చాలా అవసరం అని కీ పేర్కొన్నారు. మరి, కోతులు.. సక్సెస్ ఫుల్‌గా అంతరిక్షంలో తమ లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేసి.. పండంటి బిడ్డతో తిరిగి వస్తాయో లేదో చూడాలి. మరి, అక్కడ ఆ ప్రయోగం విజయవంతమైతే.. తర్వాత ఏమిటనేది చైనా ఇంకా వెల్లడించలేదు.
Also Read: పురుషత్వానికి సవాల్, స్పెర్మ్ కౌంట్ భారీగా పతనం - షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం