అధిక బరువు ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారింది. గంటల తరబడి కూర్చొని పనిచేయడం, అధికంగా జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల అధిక బరువు బారిన త్వరగా పడుతున్నారు. వీరిలో ఎంతోమంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. వారు బరువు తగ్గడానికి చేసే ప్రయాణంలో ఆహారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆహారంలో ప్రోటీన్ ని చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు అని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. మాంసాహారం తినేవారిలో గుడ్లు, చికెన్, చేపలు వంటి వాటిలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అయితే చేపలు, చికెన్లో ఏది తింటే బరువు త్వరగా తగ్గుతారు? అనేది ఎక్కువ మందికి ఉన్న సందేహం.
చేపలు ఎందుకు తినాలి?
ఇప్పటికే ఎన్నో పరిశోధనలు చేపలు తినడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారని నిరూపించాయి. ఇతర రకాల ప్రోటీన్లతో పోలిస్తే చేపల్లో దొరికే ప్రోటీన్లు ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవి ఎక్కువ కాలం పాటు ఆకలి వేయకుండా అడ్డుకుంటాయి. బరువు తగ్గడంతో పాటు, కండరాలను నిర్మించడంలో ,శరీరంలో శక్తి స్థాయిలో నిలబెట్టడంలో ఇవి సహాయపడతాయి. చేపలను తీసుకోవడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు. చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. గుండెకు ఇవి చాలా మేలు చేస్తాయి.
చికెన్ ఎందుకు తినాలి?
చాలామంది చికెన్ తినడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటారు. అధిక మొత్తంలో తినకుండా, మితంగా చికెన్ తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా చికెన్ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఆకలి కూడా తగ్గుతుంది. చికెన్ వేపుళ్లు, ప్రాసెస్ చేసిన చికెన్లు తినకుండా తాజా మాంసాన్ని తెచ్చుకొని వండుకొని తింటే ఎంతో మంచిది.
రెండింటిలో ఏది తింటే మంచిది?
చేపలు, చికెన్ ఈ రెండింటిలో త్వరగా బరువు తగ్గాలి అంటే ఏది తినాలి? ఇక్కడ పరిశోధకులు చెబుతున్న జవాబు ఒకటే ...ఈ రెండింటిని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిదే. కాకపోతే ఏదైనా మితంగా తినాలని గుర్తుపెట్టుకోండి. అలాగే నూనెలో వేయించిన చికెన్, చేపలు తినడం వల్ల ఫలితం ఉండదు. కాబట్టి కూరలాగా ఉడకబెట్టుకొని తినడమే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వీటిని అధికంగా తింటే ప్రోటీన్ అధికంగా శరీరంలో నిల్వ అవుతుంది. దీని వల్ల బరువు పెరిగిపోతారు. కాబట్టి మితంగానే తినాలి. చికెన్ తో పోలిస్తే చేపలు అధికంగా తిన్న త్వరగా బరువు పెరగరు. కానీ చికెన్ అధికంగా తింటే మాత్రం త్వరగా బరువు పెరిగిపోతారు. వారానికి రెండుసార్లు చేపలు తింటే మంచిది. అలాగే చికెన్ కూడా వారానికి రెండు సార్లు మితంగా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
Also read: మొఘల్ చక్రవర్తులకు ఎండు అల్లం అంటే ఎందుకంత ప్రేమ? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.