Janasenani Suspence :  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అధికారపార్టీపై ఎప్పుడు విమర్శలు చేసినా ఏదో ఒక విషయం హైలెట్‌ అవుతూనే ఉంటుంది. ఆలోచించి మాట్లాడతారా లేదంటే ఆవేశంలో  నోరుజారుతారన్న అన్న వాదనలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈ సారి కూడా అలాంటి మాటే పవన్‌ నోట రావడం, అది చర్చనీయాంశంగా మారడంతో ఇంతకీ ఎవరతను అన్న ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన జనసేన యువశక్తి సభ మరోసారి అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. జగన్‌ ఖైదీ అని, పాలన సరిగ్గా చేయలేని రాజని ఇలా పలు విమర్శలతో అధికారపార్టీపై, మంత్రులను విమర్శలతో విరుచుకుపడ్డారు. 


శత్రువుతో కలుస్తానని పవన్ చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించి ? 


సంక్షేమపథకాలకు ఇస్తున్న నిధుల గురించి ప్రస్తావిస్తూ రోజుకి 50, 100 రూపాయలతో ఏం వస్తాయో చెప్పాలని సిఎం జగన్‌ ను నిలదీశారు. ఇలా విమర్శించడానికి ఈ సభ పెట్టలేదంటూనే ప్రభుత్వ పాలన,మంత్రుల తీరుపై తన స్టైల్లో ఘాటుగా విమర్శలు గుప్పించారు.  ఇలా తిడుతూ తిడుతూ చెడ్డోడిని ఓడించడానికి అవసరమైతే శత్రువుతో చేతులు కలపాలన్న మాట ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఇంతకీ శత్రువు ఎవరు పవర్‌ స్టార్‌ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీలతో పొత్తులపై మాట్లాడుతూ మీరు నన్ను గెలిపిస్తానంటేనే ఒంటరిగా వెళ్తా లేదంటే  పోటీ చేసి వీరమరణం పొందడం ఎందుకని జిల్లా ప్రజలను ప్రశ్నించారు. ఈ పొత్తులపై మాట్లాడే సందర్బంలోనే శత్రువుతో చేతులు కలపాలన్న మాట రావడంతో ఎవరా విరోధి అన్న చర్చ మొదలైంది.


బీజేపీని అన్నారా ? చంద్రబాబునా ? 


చంద్రబాబుని మిత్రుడిగా చూస్తున్నారా లేదంటే శత్రువుగా భావిస్తున్నారా? అని కొందరు, బీజేపీనుద్దేశించి అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రోడ్‌ మ్యాప్‌ ఇవ్వని కారణంగానే కాషాయంతో కటీఫ్‌ చెప్పి సైకిల్‌ ఎక్కాలనుకుంటున్నానని మంగళగిరి జనసైనికుల సమావేశంలో స్పష్టం చేశారు. అప్పటి నుంచి బీజేపీ-జనసేనల మధ్య పొత్తులపై చర్చ రాకపోయినా మాతోనే పవన్‌ కల్యాణ్‌ ఉంటారని కమలం చెప్పుకొచ్చింది. కానీ పవర్‌ స్టార్‌ నుంచి మాత్రం బీజేపీతో దోస్తీపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ వ్యవహారం నడుస్తున్న టైమ్‌ లోనే బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా తో నాదెండ్ల భేటీ కావడం ఆయన పార్టీ మారుతున్నారన్న వార్తలు రావడం జరిగిపోయాయి. దీనిపై గుస్సాగా ఉన్న బీజేపీ జనసేన అధినేతకి జలక్‌ ఇచ్చిందన్న వార్తలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. 


పవన్ పిలక బీజేపీ చేతుల్లో ఉందా ?


పవన్‌ పిలక బీజేపీ చేతిలో ఉందని ఇప్పటికే అధికార వైసీపీ ఆరోపిస్తోంది. తోక జాడిస్తే తోలు తీస్తుందని సైటర్లు వేస్తోంది. ఈ విమర్శలు ఎలా ఉన్నా కానీ యువశక్తి సభలో పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని గెలిపిస్తే జిల్లాని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, రోడ్లు వేయిస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఆంధ్రయూనివర్సిటీకి పూర్వవైభవం తెప్పిస్తామని హామీలు ఇచ్చారు. మరి ఈ హామీలను జిల్లా నేతలు గుర్తుంచుకొని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారా లేదంటే విశాఖ పరిపాలనా రాజధానిగా రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్న అధికారపార్టీ మాటలను విశ్వసిస్తారా అన్నది ఎన్నికల ఫలితాల్లో తేలిపోతుంది.