TS Congress Manikrao :   విన్నపాలు విన్నారు.. వివరాలు రాసుకున్నారు. అంతేకాదు వివరంగా చెప్పి వెళ్లారు అన్న మాటలు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరి గురించి అంటే టి కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంఛార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే రెండు రోజుల పాటు పార్టీ నేతలతో జరిపిన భేటీపైనే ఈ ముచ్చటంతా.  తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ గా నియమితులైన మాణిక్‌ రావు ఠాక్రే  రెండురోజుల పాటు పార్టీ నేతలందరినీ కలిశారు. పీసీసీ నుంచి డీసీసీ వరకు అన్ని స్థాయిల కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి మాట్లాడారు. 


ఓపికగా అందరి నేతలతోనూ మాట్లాడిన మాణిక్ రావు థాక్రే 


ముందుగా పీసీసీ అధ్యక్షుడితో ఆ తర్వాత సీనియర్లతో చివరకు పార్టీ కార్యకర్తలతో కూడా ముచ్చటించారు. అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరించారు. వివరాలు సేకరించారు. సీనియార్టీ, హోదాని బట్టి ఒక్కొక్కరికి 5 నిమిషాల నుంచి అర్థగంట వరకు సమయం కేటాయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, పార్టీ బలహీనతలు- బలాలు ఏంటి, అధికార పార్టీ వైఫల్యాలు , బీజేపీ ప్లస్‌ - మైనస్స్‌ లు  ఇలా ఒకటేమిటి అన్ని విషయాలపైనా పార్టీ నేతలతో చర్చలు జరిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నారు.  ఈ భేటీలో పీసీసీ ఛీప్‌ రేవంత్‌ తోపాటు సీనియర్లు, కోమటిరెడ్డితో జరిపిన చర్చల్లో ఠాక్రేకి ఫుల్‌ క్లారిటీ వచ్చేసిందట. పార్టీలో ఎక్కడ లోపం ఉంది..ఎవరెవరు ఎలాంటి తప్పిదాలు చేస్తున్నారన్న విషయంపై అవగాహనకు వచ్చారట. 


ప్రస్తుతానికి సున్నితంగానే సీనియర్ల వ్యవహారాన్ని డీల్ చేసిన థాక్రే 


జనవరి 26 నుంచి జరగనున్న హాత్‌ సే హాతో జోడో యాత్ర యథావిథిగా జరుగుతుందని స్పష్టం చేసిన ఠాక్రే రెండు నెలల పాటు నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆదేశించారట. రాహుల్‌ సందేశంతో కూడిన లేఖని ప్రతీ ఇంటికి అందించేలా ఈ యాత్ర ఉండబోతోందని దిశానిర్దేశం చేశారట. అలాగే స్పర్థలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించారట. ఎవరెవరు ఏఏ బాధ్యతలు తీసుకోవాలో త్వరలోనే వివరంగా చెబుతానన్న ఠాక్రే ప్రస్తుతానికైతే సున్నితంగానే నేతలతో వ్యవహారాన్ని ముగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డితో సీనియర్లు ఎక్కువగా రేవంత్‌ పైనే ఎక్కువగా విమర్శలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


ఫిబ్రవరిలో జరగనున్న ప్లీనరీ సమావేశాల అనంతరం భారీ మార్పు చేర్పులు 


గాంధీభవన్‌ కి రానని చెప్పి ఎమ్మెల్యే క్యార్టర్స్‌ లో ఠాక్రేని కలిసిన కోమటిరెడ్డితో  ఓ సీనియర్‌ గా పార్టీకి నువ్వు ఏం చేస్తావు , రానున్న ఎన్నికలకు పార్టీశ్రేణులను ఎలా ముందుకు నడిపిస్తావో చెప్పమని అడిగినట్లు తెలుస్తోంది. మిగిలిన నేతలను కూడా ఇదే విషయాలపై సలహాలు, సూచనలు అడిగారట. అంతేకాదు మరో వారం రోజుల్లో తిరిగి హైదరాబాద్‌ కి వస్తానని ఈలోపు హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర విధివిధానాలపై సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటానని ఠాక్రే చెప్పారు. మరోవైపు పార్టీ బలంగా ఉన్నా నేతల్లోనే ఐక్యత లేదన్న విషయం ఠాక్రేకి అర్థమయ్యిందట. ఇప్పటికైతే నేతలతో దూకుడుగా వ్యవహరించకుండా  తన స్టైల్లో చెప్పాల్సింది చెప్పి మిగిలిన వివరాలను అధిష్టానానికి చేరవేయనున్నారట ఠాక్రే.  ఫిబ్రవరిలో జరగనున్న ప్లీనరీ సమావేశాల అనంతరమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ లో భారీ మార్పులు -చేర్పులు ఉంటాయన్న టాక్‌ వినిపిస్తోంది.