Central Cabinet :  కేంద్ర మంత్రి వర్గాన్ని సంక్రాంతి తర్వాత విస్తరించనున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా బీజేపీ వ్యూహం ప్రకారం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యాన్నికేబినెట్‌లో కల్పిస్తారు. ఈ ఏడాది చివరి వరకూ  తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ష, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొంత మంది కొత్త ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చునని బీజేపీలో చర్చ జరుగుతుంది. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను తొలగించి కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది జూలై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ సమయంలో 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు.


ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యంతో పాటు పార్లమెంట్ ఎన్నికల టీం ! 
 
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరో 15 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే, ఒకవైపు బీజేపీలోనూ, మరోవైపు ప్రభుత్వంలోనూ మార్పులు చేర్పులు చేసేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గం విస్తరణ జరిగితే 2023లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పెద్దపీటవేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగుస్తుంది. మరోసారి నడ్డాను అధ్యక్ష పదవిలో కొనసాగించినప్పటికీ, పార్టీ పదవుల్లో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తొలుత, మంత్రి వర్గంలో పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని, బడ్జెట్ సెషన్ కంటే ముందే ఈ ప్రక్రియ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ తరువాత పార్టీలో కీలక పదవుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని, ఈ ప్రక్రియ అంతా మరికొద్ది నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొనే జరుగుతుందని సమాచారం.


తెలంగాణ నుంచి మరో కేంద్ర మంత్రి ?


తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి చాన్స్ ఇవ్వొచ్చని చెబుతున్నారు.  ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్నారు.- తెలంగాణలో బీజేపీకి ప్రస్తుతం నలుగులు ఎంపీల బలం ఉంది. బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపూరావులు లోక్‌సభకు, కె. లక్ష్ణణ్ రాజ్యసభ ఎంపీలుగా కొనసాగుతున్నారు. వీరిలో సోయం బాపూరావు మినహా మిగిలిన మగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. వారిలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ వర్గాన్ని ఓటు బ్యాంక్‌గా చేసుకోవడానికి బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ కోణం నుంచే బండి సంజయ్‌కు కేంద్ర మంత్రిగా చాన్స్ దక్కవచ్చని భావిస్తున్నారు. లక్ష్మణ్ కు ఇటీవల బీజేపీ అత్యున్నత కమిటీల్లో చోటు కల్పించారు. దీంతో  కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవచ్చంటున్నారు. 


ఏపీ నుంచి ఓ కేంద్ర మంత్రి ?
 
దేశంలో అన్ని రాష్ట్రాలకు ఓ కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం ఉంది కానీ ఏపీకి మాత్రం లేరు. ఈ సారి ఏపీ నుంచి కూడా ఓ కేంద్ర మంత్రి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీకి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, జీవీఎల్ ఉన్నారు. జీవీఎల్ యూపీ కోటాలో ఎంపీ అయ్యారు. సీఎం రమేష్ టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. వీరిలో ఎవరికైనా చోటు కల్పిస్తారా .. లేకపోతే.. కొత్తగా ఎవరికైనా చోటు కల్పించి..  రాజ్యసభకు పంపుతారా అన్నది సస్పెన్స్ మారింది.  ఓ సహాయ మంత్రి పదవి అయినా ఇవ్వకపోతే ఏపీని ఘోరంగా నిర్లక్ష్యం చేసినట్లవుతుందన్న భావన ఏర్పడుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.