మీరు తినేవి, తాగేవి జాగ్రత్తగా ఎంపిక చేసుకోగలరు. మరి సబ్బుల్లాంటి వాటిని ఏవి మంచివో ఎలా ఎంపిక చేసుకుంటారు? అందులో వాడిన రసాయనాలు మీరు కనిపెట్టలేరు కదా.. రంగు, వాసన ఆకర్షణీయంగా ఉంటే చాలు ఆ సబ్బును కొనేసే వాళ్లు ఎక్కువ మంది. కానీ ఆ సబ్బులో ఏమేం రసాయనాలు ఉన్నాయో ఎప్పుడైనా చెక్ చేశారా? కొన్ని రకాల సబ్బులు ప్రమాదకరమైన రసాయనాలతో నిండి ఉంటాయి. అవి చర్మంలోకి చొచ్చుకెళ్లి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను కలుగజేస్తాయి. ఈ సబ్బు కవర్‌పై ఆ సబ్బు తయారీకి వాడిన ఉత్పత్తుల జాబితా ఉంటుంది. అందులో కొన్ని రకాల రసాయనాలు పేర్లు ఉంటే వాటిని తీసుకోకండి. ఆ ప్రమాదకరమైన రసాయనాలు జాబితా ఇదిగో...
1,4 డయాక్సేన్
ఇది అనేక సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ కోసం తయారుచేసిన ఉత్పత్తులలో కనిపించే కలుషిత పదార్థం. ఇది మానక క్యాన్సర్ కారకం. కొన్ని కాస్మోటిక్ తయారీల ప్రక్రియలో ఏర్పడే సమ్మేళనం ఇది. మీరు కొన్న సబ్బులు లేదా కాస్మోటిక్స్ కవర్ పై "PEG," "పాలిథిలిన్," "పాలిథిలిన్ గ్లైకాల్," "పాలియోక్సీథైలీన్," "-eth-," లేదా "oxynol ఇలా ఏది కనిపించినా అందులో ఈ రసాయనం ఉన్నట్టే లెక్క. ఇది డిటర్జెంట్లు, ఫోమింగ్ ఏజెంట్లు, సబ్బుల్లో అధికంగా కనిపిస్తుంది. దీనికి ఎన్విరాన్‌మెంటల్ వర్కింగ్ గ్రూప్ వారు ప్రమాదకరమైన రేటింగ్ ఇచ్చారు. దీన్ని దీర్ఘకాలికంగా వాడితే క్యాన్సర్ కారకంగా మారుతుంది.
సోడియం లారిల్ సల్ఫేట్ (SLS)
దీన్ని సోడియం లారెత్ సల్ఫేట్ అని కూడా పిలుస్తారు. సోడియం లారెత్ సల్ఫేట్ అనేది ఒక కఠినమైన సింథటిక్ డిటర్జెంట్, ఫోమింగ్ ఏజెంట్. సబ్బులోని ఇతర సాధారణ పదార్థాలతో ఇది బంధం ఏర్పరచుకోవడం వల్ల కార్సినోజెనిక్ నైట్రోసమైన్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. దీని వల్ల చర్మ సమస్యలు పెరుగుతాయి. తామర, అలెర్జీల వంటివి వస్తాయి.
ట్రైక్లోసన్
ఇది యాంటీ బాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో కూడిన ఒక పురుగు మందు. ఈ రసాయనానికి పర్యావరణ సంస్థలు ప్రమాదకరమైన రేటింగును ఇచ్చాయి. దీన్ని సబ్బులు, కాస్మోటిక్స్, ఆహార ప్యాకేజింగ్, క్రీడాకారలు దుస్తుల తయారీలో వాడుతూనే ఉన్నారు. ఈ రసాయనం మన శరీరంలోని ఎండోక్రైన్ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అలాగే కళ్లు, చర్మం, ఊపిరితిత్తులకు సమస్యలు తెచ్చిపెడుతుంది.
పారాబెన్స్
పారాబెన్‌లు వివిధ రకాల కాస్మోటిక్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పతుల్లో వాడుతుంటారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. తరచూ వాడడం వల్ల చర్మంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి.
యూరియా
డయాజోలిడినైల్ యూరియా వంటివి ఫార్మాల్డిహైడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇది పైన చెప్పిన రసాయనాల కన్నా చాలా ప్రమాదకరమైనది. క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది. ఇది లేని ఉత్పత్తులు మాత్రమే వాడాలి. కొనే ఉత్పత్తులపై ఉన్న లేబుళ్లను చదివి మరీ తీసుకోండి. ఈ రసాయనాలు పేర్లు కనిపిస్తే వాడక పోవడం చాలా మంచిది.
Also read: రోజుకు పదినిమిషాలు వ్యాయామం చేస్తే చాలు, అకాల మరణాల రేటును తగ్గించుకోవచ్చు
Also read: ఆస్కార్ నామినేషన్లలో ‘రైటింగ్ విత్ ఫైర్’, ఇది కథ కాదు, ఆ మహిళల నిజ జీవితం