రోజూ గంట సేపు వ్యాయామం చేస్తే అధిక బరువు తగ్గొచ్చు, రోజంతా చలాకీగా ఉండొచ్చు అని చెబుతుంటారు ఫిట్‌నెస్ నిపుణులు. కానీ కొత్త అధ్యయనం మాత్రం కేవలం రోజుకు పావుగంట సేపు వ్యాయామం చేసినా చాలు తీవ్ర అనారోగ్యం బారిన పడడం తగ్గుతుందని, దాని ద్వారా మరణం త్వరగా సంభవించదని చెబుతున్నారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ క్యాన్సర్ ఇన్సిట్యూట్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థలకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటిపడినట్టు రాశారు. వీరంతా పెద్దవాళ్ల జనాభాలో శారీరక శ్రమ వల్ల కలిగే మార్పులను, ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. ఆ పరిశోధనలో భాగంగా చేసిన అధ్యయనంలో వ్యాయామం వల్ల పెద్దవాళ్లలో మరణాల శాతాన్ని తగ్గించవచ్చని తేలింది. 


నలభై ఏళ్ల నుంచి 85 ఏళ్ల మధ్య ఉన్న వారిపై ఈ పరిశోధన సాగింది. ఈ వయసు వారు రోజుకు పది నిమిషాల చొప్పున మితమైన, చురుకైన శారీరక శ్రమను  చేస్తే చాలు, వారి మరణాల శాతంలో 6.9శాతం నివారించవచ్చని లేదా ఏడాదికి లక్షకు పైగా మరణాలను తగ్గించవచ్చని తేలింది. ఈ అధ్యయనం కొంతమంది అమెరికన్లపై చేశారు. వారి యాక్సిలరోమీటర్ ఆధారిత కొలతలను ఉపయోగించి శారీరక శ్రమ ద్వారా నివారించగల మరణాల సంఖ్యను అంచనా వేసినట్టు చెప్పారు అధ్యయనకర్తలు. గతంలో కూడా నేషనల్ క్యాన్సర్ ఇన్ట్సిట్యూట్ మునుపటి అధ్యయనాలు శారీరక శ్రమ మానవ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని తేలింది. కొన్ని క్యాన్సర్లతో సహా అకాల మరణానికి కారణమయ్యే అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని కనిపెట్టారు.


పిల్లల్ని ఆడనివ్వండి...
చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని పరిగెట్టనివ్వరు. ఎక్కడ పడిపోతారని భయపడుతుంటారు. పడిపోయినా మళ్లీ లేస్తారుగా... కానీ పూర్తిగా వారిని శారీరక శ్రమకు దూరం చేస్తే మాత్రం వారి ఆరోగ్యానికే చాలా ప్రమాదం. ఎదిగే వయసులో ఉన్న పిల్లలు కనీసం రోజుకు గంట సేపు చెమటలు పట్టేలా ఆడాలి. అది వారి మానసిక, శారీరక ఆరోగ్యాలకు చాలా మంచిది. 12 ఏళ్ల లోపు వయసులో వ్యాయామం చేసిన పిల్లలు పెద్దయ్యాక చాలా చురుకుగా ఉంటారని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. వారిలో ఆలోచనా శక్తి కూడా పెరుగుతుందని తెలిపారు. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటూ శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం. కాబట్టి పిల్లలతో పాటూ మీరూ కాసేపు ఆడండి.  


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.